బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ను అభివృద్ధి చేసిన ఎస్సార్ స్టీల్

7 Jul, 2016 00:33 IST|Sakshi
బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ను అభివృద్ధి చేసిన ఎస్సార్ స్టీల్

ఈ తరహా స్టీల్‌ను తయారు చేసిన తొలి కంపెనీ
ముంబై: ఎస్సార్ స్టీల్ కంపెనీ  బుల్లెట్ ప్రూఫ్ ఉక్కును అభివృద్ధి చేసింది. అత్యున్నత పనితీరు కనబరిచే ఈ బుల్లెట్‌ప్రూఫ్ ఉక్కును అభివృద్ధి  చేసిన తొలి దేశీయ కంపెనీ తమదేనని ఎస్సార్ స్టీల్ తెలిపింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉక్కును రక్షణ రంగంలో అధికంగా ఉపయోగిస్తారు. తేలికపాటి ఆయుధాల వాహనాలు, రక్షణ ఛత్రాలు, నిర్మాణాల్లో ఈ  బుల్లెట్ ప్రూఫ్ ఉక్కును ఉపయోగిస్తారని, మంచి డిమాండ్, వృద్ధి  ఉండగలవని ఎస్సార్ స్టీల్ ఈడీ(స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్‌మెంట్) విక్రమ్ అమిన్ చెప్పారు. అత్యున్నత భద్రత అవసరమైన వారికి,  పౌర వాహనాల బుల్లెట్ ప్రూఫింగ్‌కు, ఈ స్టీల్ ఉపయోగపడుతుందన్నారు. 

ఈ బుల్లెట్ ప్రూఫ్ స్టీల్‌ను సెకన్‌కు 700 మీ. వేగంతో దూసుకు వచ్చే బుల్లెట్ ఏమీ చేయలేదని వివరించారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ కఠినత్వం 500 బీహెచ్‌ఎన్(బ్రినెల్‌హార్డ్‌నెస్ నంబర్) ఉంటుందని పేర్కొన్నారు. ఈ  బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ పనితీరును భారత్‌లోనూ, జర్మనీలోనూ తనిఖీ చేశామని తెలిపారు.  ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉక్కు తయారు చేయడం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి తమ కంపెనీ అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రక్షణ రంగానికి కావలసిన సామగ్రిని, పరికరాలను దేశీయంగానే తయారు చేయాలనేది ప్రభుత్వ అభిమతమని వివరించారు.

మరిన్ని వార్తలు