మా వాటాలో 50 శాతం అమ్మేస్తాం

14 Nov, 2018 02:27 IST|Sakshi

అత్యాధునిక టెక్నాలజీ కంపెనీగా అవతరించే ఉద్దేశం

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోటర్లు

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీల్‌) ప్రమోటర్లు కంపెనీలో తమకున్న వాటాలో 50% వరకు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు తెలిపింది. దీపావళి వారాంతంలో కంపెనీ ప్రమోటర్లు సుభాష్‌చంద్ర, అతని కుటుంబం, సలహాదారులతో ముంబైలో సమావేశమై అంతర్జాతీయంగా మీడియా స్వరూపాలు మారిపోతున్న క్రమంలో తమ వ్యాపార వ్యూహాలను సమీక్షించినట్టు పేర్కొంది.

కంపెనీలో ఎస్సెల్‌ హోల్డింగ్స్‌కు ఉన్న వాటాల్లో 50% పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలియజేసింది. ఎస్సెల్‌ గ్రూపు నిధుల కేటాయింపు అవసరాల కోసం, అదే సమయంలో పెద్ద ఎత్తున టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో, టెక్నాలజీ మీడియా కంపెనీగా పరిణామం చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తమ నిర్ణయం వెనుక ఉద్దేశాలను వివరించింది.

సరైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామి ఎంపిక అన్నది వేగంగా మారిపోతున్న టెక్నాలజీలకు అనుగుణంగా కంపెనీని మార్చివేయడంలో సాయపడుతుందని అభిప్రాయపడింది. ఇందు కోసం గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా)ను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గాను, లయన్‌ట్రీని అంతర్జాతీయ సలహాదారుగాను నియమించుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ త్రైమాసికం చివరికి జీల్‌లో ప్రమోటర్ల గ్రూపుకు 41.62% వాటా ఉంది. మంగళవారం నాటి షేరు క్లోజింగ్‌ దర రూ.438.20 ప్రకారం ప్రమోటర్ల వాటాల విలువ రూ.17,517 కోట్లు చేస్తుంది.

మరిన్ని వార్తలు