ఇథనాల్‌ ధర లీటరుకు రూ.1.84 పెంపు

4 Sep, 2019 10:31 IST|Sakshi

1 బిలియన్‌ డాలర్ల మేర తగ్గనున్న

చమురు దిగుమతుల భారం

న్యూఢిల్లీ: చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటా 1 బిలియన్‌ డాలర్ల మేర చమురు దిగుమతుల భారం తగ్గుతుందని అంచనా. డిసెంబర్‌ 1 నుంచి చక్కెర మిల్లుల నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ రంగ కంపెనీలు కొత్త రేట్ల ప్రకారం కొనుగోళ్లు జరుపుతాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ’సి గ్రేడు మొలాసిస్‌’ నుంచి తీసిన ఇథనాల్‌ ధర లీటరుకు 29 పైసలు పెంచడంతో కొత్త ధర రూ. 43.75గా ఉండనుంది.

ఇక ’బి గ్రేడు మొలాసిస్‌’ నుంచి తీసే ఇథనాల్‌ రేటు రూ. 1.84 పెరిగి లీటరు ధర రూ. 54.27కి చేరుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమ పరిమాణం పెంచడం వల్ల ఏటా 2 మిలియన్‌ టన్నుల మేర చమురు వినియోగం, తద్వారా 1 బిలియన్‌ డాలర్ల దిగుమతుల భారం తగ్గుతుందని ప్రధాన్‌ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 7 శాతానికి, 2021–22 నాటికి 10 శాతానికి పెరగనున్నట్లు ఆయన వివరించారు. 2018–19లో 226 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతులపై భారత్‌ 112 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

మరిన్ని వార్తలు