గూగుల్‌కి 5 బిలియన్‌ డాలర్లు జరిమానా

19 Jul, 2018 01:04 IST|Sakshi

4.3 బిలియన్‌ యూరోల జరిమానా 

ఆండ్రాయిడ్‌ ఆధిపత్య ధోరణి 

దుర్వినియోగం కారణం 

బ్రసెల్స్‌:  టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) కాంపిటీషన్‌ కమిషన్‌ భారీ షాకిచ్చింది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ సిస్టమ్‌ ఆధిపత్య దుర్వినియోగ ధోరణులకు గాను 4.3 బిలియన్‌ యూరోల (5 బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. సొంత సెర్చ్‌ ఇంజిన్, బ్రౌజర్‌ వినియోగాన్ని పెంచేందుకు స్మార్ట్‌ఫోన్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో ఆధిపత్యం ఉన్న ఆండ్రాయిడ్‌ను గూగుల్‌ ఉపయోగించుకుందని ఈయూ కాంపిటీషన్‌ కమిషనర్‌ మార్గరెట్‌ వెస్టాజర్‌ పేర్కొన్నారు. గతంలో మరో కేసులో గూగుల్‌పై ఈయూ కమిషన్‌ విధించిన పెనాల్టీకి తాజా జరిమానా రెట్టింపు కావడం గమనార్హం. ఉత్పత్తులను పోల్చి చూపే సర్వీసులను అందించడంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2017లో గూగుల్‌పై ఈయూ కమిషన్‌ 2.4 బిలియన్‌ యూరోల జరిమానా విధించింది. ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచడం ద్వారా అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో గూగుల్‌పై ఈయూ కమిషన్‌ రికార్డు స్థాయిలో జరిమానా విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దిగుమతి సుంకాల వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చించేందుకు యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ జాన్‌ క్లాడ్‌ జంకర్‌ మరో వారంలో అమెరికా వెళ్లనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం.  

ఈయూ నిబంధనల ప్రకారం గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వార్షికాదాయంలో 10 శాతం దాకా జరిమానా విధించవచ్చు. గతేడాది ఆల్ఫాబెట్‌ ఆదాయం 110.9 బిలియన్‌ డాలర్లు.   
ఆరోపణలు ఇవీ..: ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధిపత్య దుర్వినియోగానికి సంబంధించి గూగుల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, ప్రాచుర్యంలో ఉన్న కొన్ని గూగుల్‌ యాప్స్‌లకు లైసెన్సు తీసుకోవాలంటే ఆయా స్మార్ట్‌ఫోన్స్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌తో పాటు తమ సెర్చి ఇంజిన్‌ను ఇన్‌స్టాల్‌ చేయాల్సిందేనంటూ శాంసంగ్‌ వంటి హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలకు గూగుల్‌ షరతులు విధిస్తోందని అభియోగాలు ఉన్నాయి. దీనివల్ల సదరు డివైజ్‌లను కొనుగోలు చేసిన వారు ప్రీ–ఇన్‌స్టాల్డ్‌ గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజరు, సెర్చి ఇంజిన్లే ఉపయోగిస్తూ మిగతా వాటి వైపు చూడటం లేదని.. ఆ రకంగా పోటీ సంస్థలను తొక్కేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ కోడ్‌ ఆధారిత పోటీ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో హ్యాండ్‌సెట్స్‌ను ఉత్పత్తి చేయకుండా కంపెనీలను కూడా గూగుల్‌ అడ్డుకుంటోందంటూ ఏప్రిల్‌లో ఫిర్యాదు నమోదైంది. తమ డివైజ్‌లలో గూగుల్‌ సెర్చిని ఇన్‌స్టాల్‌ చేసే తయారీ సంస్థలు, మొబైల్‌ ఆపరేటర్లకు గూగుల్‌ ‘ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు’ కూడా అందిస్తోంది. ఈ స్థాయి ప్రోత్సాహకాలు ఇవ్వలేని పోటీ సంస్థలకు ఇది ప్రతికూలంగా ఉంటోంది. యూరోపియన్‌ యూనియన్‌లో మొత్తం 28 దేశాలు ఉన్నాయి.  

సిలికాన్‌ వేలీ దిగ్గజాలపై వెస్టాజెర్‌ పోరు.. 
యూరోపియన్‌ యూనియన్‌ కాంపిటీషన్‌ కమిషనర్‌గా గత నాలుగేళ్లుగా వెస్టాజెర్‌ పలు సిలికాన్‌ వేలీ టెక్నాలజీ దిగ్గజాలపై పోరు కొనసాగిస్తున్నారు. దీనికి యూరప్‌లో మంచి పేరే వచ్చినప్పటికీ .. అమెరికాకు మాత్రం ఆమె కంటగింపుగా మారారు. గూగుల్‌ షాపింగ్‌ ఫైల్స్, ఆండ్రాయిడ్‌ దుర్వినియోగంపై జరిమానాలు పక్కన పెడితే.. యాడ్‌సెన్స్‌ అడ్వర్టైజింగ్‌ వ్యాపారంపై కూడా ప్రస్తుతం ఈయూ కమిషన్‌ విచారణ జరుపుతోంది. మరోవైపు, వివాదాస్పద డీల్‌తో ఎగవేసిన పన్నులకు సంబంధించి ఐర్లాండ్‌కు 13 బిలియన్‌ యూరోలు చెల్లించాలంటూ  2016లో యాపిల్‌ను ఈయూ కమిషన్‌ ఆదేశించింది. అటు అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లకు కూడా ఇలాంటి జరిమానాలు తప్పలేదు.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా