హడ్కో ఐపీఓ...మే 8 నుంచి

28 Apr, 2017 00:28 IST|Sakshi
హడ్కో ఐపీఓ...మే 8 నుంచి

ధరల శ్రేణి రూ.56–60
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న పీఎస్‌యూ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే నెల 11న ముగిసే ఈ ఐపీఓ ద్వారా హడ్కో రూ.1,200 కోట్లు సమీకరించనుంది. 2012 తర్వాత ఐపీఓకు వస్తున్న తొలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. షేర్‌ ముఖ విలువ రూ.10 అని, ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.56–60గా నిర్ణయించామని  హడ్కో సీఎండీ ఎం. రవికాంత్‌ చెప్పారు.. ఈ ఐపీఓలో భాగంగా 10.19 శాతం వాటాను విక్రయించనున్నామని పేర్కొన్నారు.

 ఈ ఐపీఓలో భాగంగా 20.40 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నామని, వీటిల్లో 20.01 కోట్ల షేర్లను ఇన్వెస్టర్లకు, 38.68 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించామని వివరించారు. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, నొముర, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

 రిటైల్‌ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌ లభించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ పట్టణ మౌలిక, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లకు రుణాలందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో సగానికి పైగా ఐపీఓల ద్వారానే సమీకరించాలనేది ప్రభుత్వం ఆలోచన.

మరిన్ని వార్తలు