ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ చేతికి కెన్‌స్టార్‌

7 Nov, 2017 00:25 IST|Sakshi

వీడియోకాన్‌ నుంచి కొనుగోలు

డీల్‌ విలువ రూ. 1,300 కోట్లుగా అంచనా  

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో కుదేలవుతున్న వీడియోకాన్‌ గ్రూప్‌ నుంచి గృహోపకరణాల బ్రాండ్‌ కెన్‌స్టార్‌ను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడి కాకపోయినప్పటికీ.. సుమారు రూ. 1,300 కోట్లు ఉంటుందని అంచనా. డీల్‌ కింద బ్రాండ్‌ పేరిట నిర్వహించే వ్యాపార కార్యకలాపాలు, అత్యాధునిక తయారీ ప్లాంటుతో పాటు సెంచరీ అప్లయన్సెస్‌ (వీడియోకాన్‌ గ్రూప్‌ సంస్థ) అసెట్స్‌ కూడా బదిలీ కానున్నాయి.

కెన్‌స్టార్‌ బ్రాండ్‌ను కొనుగోలు చేసేందుకు తాము అంగీకరించినట్లు తెలిపిన ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌.. ఇందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. ‘ఒప్పందం ప్రకారం రాజీవ్‌ కెనూ సారథ్యంలోని ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ టీమ్‌ కెన్‌స్టార్‌ వ్యాపారాన్ని యథాప్రకారంగానే నిర్వహిస్తుంది. ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ నుంచి అదనపు వనరులు, ఆర్థికపరమైన పెట్టుబడుల ద్వారా వ్యాపారాన్ని మరింతగా పటిష్టపరుస్తాం‘ అని ఎవర్‌స్టోన్‌ పేర్కొంది.

డీలర్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో తోడ్పాటు అందించడం, బ్రాండ్‌ బిల్డింగ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలైన మార్గాల్లో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చేందుకు చర్యలు ఉంటాయని ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ ఎండీ అవనీష్‌ మెహ్రా తెలిపారు. కెన్‌స్టార్‌ స్వతంత్ర సంస్థగానే పనిచేసినప్పటికీ ఎవర్‌స్టోన్‌ నియంత్రణలో ఉంటుంది. 1996 అక్టోబర్‌లో ప్రారంభమైన కెన్‌స్టార్‌ బ్రాండ్‌ కింద ఎయిర్‌ కండీషనర్లు, గృహోపకరణాలు, ఎయిర్‌కూలర్లు, మిక్సర్‌ గ్రైండర్లు మొదలైనవి తయారవుతున్నాయి.

వీడియోకాన్‌కి తగ్గనున్న రుణభారం..
రూ.40,000 కోట్ల పైగా రుణాలు పేరుకుపోయిన వీడియోకాన్‌ ..  భారం తగ్గించుకునే దిశగా కెన్‌స్టార్‌ సహా వివిధ అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. 2013 జూన్‌లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ ఏరియా–1లో 10 శాతం వాటాలను ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) 2.47 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.

ఈ నిధులను దేశవిదేశాల్లో రుణాలు తీర్చేందుకు వీడియోకాన్‌ ఉపయోగించుకుంది. అటు ఆరు సర్కిల్స్‌లో తమకున్న టెలికం స్పెక్ట్రంను దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌కు వీడియోకాన్‌ రూ. 4,428 కోట్లకు విక్రయించింది. డీటీహెచ్‌ వ్యాపారాన్ని కూడా డిష్‌ టీవీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
 

వీకాన్‌ మీడియాకు రిలయన్స్‌ బిగ్‌ టీవీ
న్యూఢిల్లీ: భారీ రుణ భారంతో పీకల్లోతు కష్టాల్లోకి చేరిన అనిల్‌ అంబానీ సారధ్యంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌... తన అనుబంధ కంపెనీ రిలయన్స్‌ బిగ్‌ టీవీని (డీటీహెచ్‌ వ్యాపారం) వీకాన్‌ మీడియా అండ్‌ టెలివిజన్‌కు అమ్మేస్తున్నట్టు ప్రకటించింది. ట్రేడ్, కంటింజెంట్‌ రుణాలతోపాటు రిలయన్స్‌ బిగ్‌టీవీ వ్యాపారాన్ని ప్రస్తుతమున్న స్థితిలో యథాతథంగా వీకాన్‌ సొంతం చేసుకుంటోందని ఆర్‌కామ్‌ తెలిపింది. ఈ మేరకు రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

దీని ప్రకారం రిలయన్స్‌ బిగ్‌టీవీకి చెందిన 500 మంది ఉద్యోగులను వీకామ్‌ ఇకముందూ కొనసాగిస్తుంది.  తాజా ఒప్పందంతో రిలయన్స్‌ బిగ్‌టీవీకి చెందిన 12 లక్షల మంది కస్టమర్లకు అవాంతరాల్లేని ప్రసారాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. డిసెంబర్‌ 1 నుంచి వాయిస్‌ కాల్స్‌ సేవలను నిలిపివేయాలని ఆర్‌కామ్‌ ఇప్పటికే నిర్ణయించింది. ఆర్‌కామ్‌ రూ.45,000 కోట్ల రుణ బకాయిలు తీర్చాల్సిఉంది. ఎయిర్‌సెల్‌తో విలీనం రద్దు, టవర్ల వ్యాపారాన్ని బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించాలన్న డీల్‌ కూడా ముందుకు సాగకపోవడంతో వ్యాపారాన్ని మూసేయాలన్న నిర్ణయానికి ఆర్‌కామ్‌ వచ్చింది. 

మరిన్ని వార్తలు