2050 నాటికి ‘వృద్ధ భారతం’!

16 May, 2017 01:28 IST|Sakshi
2050 నాటికి ‘వృద్ధ భారతం’!

న్యూఢిల్లీ: ప్రస్తుతం యువభారత్‌గా ఉన్న దేశం.. 2050 నాటికల్లా వృద్ధ భారత్‌గా క్రమంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి పన్నెండు మందిలో ఒకరు అరవైలలో ఉండగా.. అప్పటికల్లా ప్రతి అయిదు మందిలో ఒకరు అరవై ఏళ్ల పైబడిన వారు ఉండనున్నారు. వయస్సుపరంగా జనాభా సంఖ్యలో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ, రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 8.9 శాతంగా ఉండగా.. 2050 నాటికి ఇది 19.4 శాతానికి పెరగనుందని దేశ వయోజనుల ఆర్థిక భద్రత అంశంపై నివేదికను విడుదల చేసిన సందర్భంగా పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ హేమంత్‌ జి. కాంట్రాక్టర్‌ తెలిపారు. నివేదిక ప్రకారం ప్రస్తుతం జనాభాలో 0.9 శాతంగా ఉన్న 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి 2.8 శాతానికి పెరగనుంది.

ఈ నేపథ్యంలో పింఛను వ్యవస్థను అభివృద్ధి చేయడం దేశ శ్రేయస్సుకు కీలకమని హేమంత్‌ చెప్పారు. ఇది ఇటు వృద్ధులకు ఆర్థిక భద్రతనివ్వడంతో పాటు దీర్ఘకాలంలో ఎకానమీ వృద్ధికి తోడ్పడే కీలక రంగాలకు నిధులను సమకూర్చేందుకు కూడా దోహదపడగలదని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు