చందా కొచర్‌కు మరో షాక్‌

30 Jan, 2019 19:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఐసీఐసీఐ-వీడియోకాన్‌ కుంభకోణానికి సంబంధించి బ్యాంకు మాజీ సీఎండీ, ఈ స్కాంలో ప్రధాన నిందితురాలు చందా కొచర్‌కు (56) మరో షాక్‌ తగిలింది. ఈ స్కాంపై విచారణకు నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ట (స్వతంత్ర కమిటీ) తన రిపోర్టును సంస్థకు అందించింది. వీడియోకాన్ రుణం కేసులో చందాకొచర్ దోషేనని, బ్యాంకునకు సంబంధించిన అంతర్గత నిబంధనలను ఆమె ఉల్లఘించారని స్వతంత్ర విచారణలో కమిటీ తేల్చింది.

ఈ మేరకు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ బ్యాంకు బుధవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ ఆరోపణలతోనే బ్యాంకు నుంచి ఆమెను తొలగించినట్టు బోర్డు ప్రకటించడం విశేషం. ఆమెకు సంబంధించిన చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు ఏప్రిల్‌,2009 నుంచి 2018 మార్చివరకు ఆమెకు చెల్లించిన బోనస్‌, ఇంక్రిమెంట్లు, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సహా ఇతర చెల్లింపులను బ్యాంకునకు వెనక్కి చెల్లించాలని పేర్కొంది.

రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీవీడియోకాన్ రుణ కేసులో క్విడ్-ప్రో-ఆరోపణలపై విచారణ జరిపింది. వీడియోకాన్ సంస్థకు రుణాల కేటాయింపు సందర్భంగా చందాకొచర్‌ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంది.

రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో చోటుచేసుకున్న సుమారు రూ.3250కోట్ల కుంభకోణంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో చందా కొచర్‌తోపాటు, ఆమె భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌లపై సీబీఐ ఇప్పటికే ఎప్‌ఐఆర్‌ నమోధు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు