చెరో 1,170 కోట్లు కట్టండి!

16 Nov, 2019 04:27 IST|Sakshi
మాల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌

‘ర్యాన్‌బ్యాక్సీ’ సింగ్‌ సోదరులది కోర్టు ధిక్కారమే

దైచీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో షేర్ల అమ్మకం తగదు

8 వారాల్లో సొమ్ము కోర్టుకు జమచేయాలి

తరువాతే శిక్షను నిర్ణయిస్తామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్‌ సింగ్, శివిందర్‌ సింగ్‌లు (సింగ్‌ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు విక్రయించడం కోర్టు ధిక్కార అంశంగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పును సరిదిద్దుకునే క్రమంలో సింగ్‌ సోదరులు ఇరువురు రూ.1,170.95 కోట్ల చొప్పున మొత్తం రూ.2,341.90 కోట్లను సుప్రీంకోర్టులో డిపాజిట్‌ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. డిపాజిట్‌ తర్వాతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్ష విషయంలో ‘కొంత వెసులుబాటు’ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.  ‘‘కేసుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సింగ్‌ సోదరులు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. కనుక వీరు ఇరువురూ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగానే ఈ కోర్టు భావిస్తోంది’’ అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తంమీద తాజా రూలింగ్‌ ఫోర్టిస్‌–ఐహెచ్‌హెచ్‌ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

 కేసు పూర్వాపరాలు...
► సింగ్‌ సోదరులు 2008లో ర్యాన్‌బాక్సీని జపాన్‌ సంస్థ దైచీ శాంక్యోకి విక్రయించారు. తర్వాత ఈ కంపెనీని దైచీ నుంచి భారత్‌కే చెందిన సన్‌ఫార్మా 3.2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.  
► అయితే ర్యాన్‌ బాక్సీ అమ్మకం వ్యవహారానికి సంబంధించి సింగ్‌ సోదరులపై దైచీ సింగపూర్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.  అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌తో పలు రెగ్యులేటరీ సమస్యలను ర్యాన్‌బాక్సీ ఎదుర్కొంటోందని, అయితే విక్రయ ఒప్పందాల సమయంలో ఈ అంశాలను సింగ్‌ సోదరులు వెల్లడించలేదన్నది దైచీ ఆరోపణల్లో ప్రధానమైనది. ఈ కేసులో 2016లో రూ. 2,562 కోట్ల పరిహారాన్ని (అవార్డు) ట్రిబ్యునల్‌ నుంచి పొందింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సింగ్‌ సోదరులు భారత్, సింగ్‌పూర్‌ కోర్టుల్లో సవాలు చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో సింగ్‌ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ
ఆర్బిట్రల్‌ అవార్డును హైకోర్టు సమర్థించింది.  
► దీనితో ఆయా అంశాలపై సింగ్‌ సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు.  ఇక్కడ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 16న వారి అప్పీల్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఫోర్టిస్‌లో తమకు ఉన్న వాటాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు సింగ్‌ సోదరులను ఆదేశించింది.
► అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ, ఫోర్టిస్‌లో వాటాలను సింగ్‌ సోదరు లు మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు అమ్మేశారు.
► ఈ విషయాన్ని దైచీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో గత ఏడాది డిసెంబర్‌ 14న ఫోర్టిస్‌–ఐహెచ్‌హెచ్‌ ఒప్పం దంపై సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  
► మార్చిలో దైచీ సుప్రీంకోర్టులో సింగ్‌ సోదరులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా దాఖలు చేసింది.  
► ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు ‘ధిక్కరణ’ విచారణను చేపట్టింది. ఫోర్టిస్‌కు సంబంధించి ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ఓపెన్‌ ఆఫర్‌పై ఇచ్చిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌పై విచరణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు