పేటీఎంలో చేరిన ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌

20 Jun, 2018 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీల్లో దూసుకుపోయిన ప్లాట్‌ఫామ్‌ ఏదైనా ఉందా? అంటే అది పేటీఎం సంస్థనే. వన్‌97 కమ్యూనికేషన్‌కు చెందిన ఈ సంస్థలో సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ డిప్యూటీ గవర్నర్‌ రమ సుబ్రహ్మణ్యం గాంధీ చేరారు. పేటీఎం అడ్వయిజరీగా ఆయన బాధ్యతలు చేపట్టినట్టు తెలిసింది. పేమెంట్‌ సిస్టమ్స్‌, రెగ్యులేషన్స్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో గాంధీకున్న అనుభవాలు, నైపుణ్యాలు పేటీఎంకు ఎంతో ఉపయోగపడనున్నాయని కంపెనీ చెప్పింది. గాంధీ తొలి మానిటరీ పాలసీ కమిటీలో సభ్యుడు కూడా. రిజర్వు బ్యాంక్‌కు చెందిన రెండు స్థానిక ఆఫీసులకు అధినేతగా వ్యవహరించారు. 

ఆర్‌బీఐలో పలు వ్యూహాత్మక పాత్రలు పోషించిన ఆయన, ఐటీ, పేమెంట్‌ సిస్టమ్స్‌, ఫైనాన్సియల్‌ లిటరసీ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలకు పలు ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్‌లను చేపట్టారు. 1956లో తమిళనాడులో జన్మించిన గాంధీ, అన్నమలై యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ, అమెరికన్‌ యూనివర్సిటీల నుంచి క్యాపిటల మార్కెట్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌లలో కూడా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ క్వాలిఫికేషన్‌ కలిగి ఉన్నారు. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ స్పేస్‌లో ఇన్‌స్టిట్యూషన్లను బలోపేతం చేసేందుకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు గాంధీ చెప్పారు. పేటీఎం తనను చేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  

మరిన్ని వార్తలు