రుణమాఫీలతో ఒరిగేదేమీలేదు: దువ్వూరి

7 Feb, 2015 02:21 IST|Sakshi
రుణమాఫీలతో ఒరిగేదేమీలేదు: దువ్వూరి

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న రైతు రుణ మాఫీ పథకాన్ని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదన్నారు. పైగా  ఈ రుణ మాఫీ వల్ల వ్యతిరేక పరిణామాలు సంభవిస్తాయన్నారు.  రైతుల ఆర్థిక పరిస్థితి, వారి ఈ స్థితికి దిగజారడానికి గల కారణాలు తెలుసుకుని, వారిని గట్టెక్కించడానికి ఇతర పరిష్కారమార్గాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని ఆయన అన్యాపదేశంగా సూచించారు.

శుక్రవారం ఇక్ఫాయ్ విద్యార్థులతో మాట్లాడుతూ 100 కోట్ల మంది ప్రజలు చెల్లించిన పన్నులను ఇలా రుణ మాఫీ పథకం కింద రైతులకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. ‘మీరు, మేము చెల్లించిన పన్నులతో రుణాలను ఎలా రద్దు చేస్తారని’ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ రైతు రుణ మాఫీ భారాన్ని భరిస్తున్న 100 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ సొమ్ము ఏ విధంగా వృథా అవుతున్నది తెలియకపోవడం దారుణమన్నారు.

అంతకుముందు ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని తగ్గించుకుంటూ రెండంకెల వృద్ధిపై దృష్టిసారించాలన్నారు. జనధన యోజన కింద కేవలం బ్యాంకు అకౌంట్లు తెరిపించడమే కాకుండా పేదలకు రుణాలు, లావాదేవీలు అందుబాటులోకి తెచ్చే విధంగా చూడాలన్నారు.

>
మరిన్ని వార్తలు