ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రూ.190 కోట్లు

8 May, 2018 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక, వాహన బ్యాటరీలు తయారు చేసే ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.190 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో నికర లాభం రూ.164 కోట్లు. ఆదాయం రూ.2,204 కోట్ల నుంచి రూ.2,459 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.694 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.668 కోట్లకు తగ్గింది. ఆదాయం రూ.8,554 కోట్ల నుంచి రూ.9,460 కోట్లకు ఎగసింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 80 పైసల తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలియజేసింది.
 

గత ఏడాది నవంబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.1.60 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, దీంతో గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.2.40 డివిడెండ్‌ను ఇచ్చినట్లవుతుందని వివరించింది. గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం,  ఫలితాలను, ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈ ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.268ను తాకింది. చివరకు 5.4 శాతం లాభంతో రూ.262 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు