మార్కెట్లకు ర్యాలీ... ‘రిలీఫ్‌’

9 Mar, 2018 00:32 IST|Sakshi

కొన్ని దేశాలకు సుంకాల మినహాయింపు!

తగ్గిన వాణిజ్య యుద్ధాల భయం  

పెరిగిన ప్రపంచ మార్కెట్లు

పీఎస్‌ బ్యాంక్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌

ఇటీవల పడ్డ షేర్లలో వేల్యూ బయింగ్‌

ఇంట్రాడేలో 407 పాయింట్లు 

లాభపడిన సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 

33,352 వద్ద ముగింపు

88 పాయింట్లు పెరిగి 10,243కు నిఫ్టీ  

వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లు నష్టాలు చూసిన స్టాక్‌ మార్కెట్‌... గురువారం కాస్త రికవరీ అయింది. సుంకాల విధింపులో కొన్ని దేశాలకు అమెరికా మినహాయింపులు ఇవ్వనున్నదన్న వార్తలలో ప్రపంచ మార్కెట్లు పెరగడం కలసివచ్చింది. ఇటీవలి వరుస ఆరు రోజుల నష్టాల కారణంగా ధరలు బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం (వేల్యూ బయింగ్‌) సానుకూల ప్రభావం చూపించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రుణ కుంభకోణం నేపథ్యంలో బాగా నష్టపోయిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో ట్రేడింగ్‌ చివర్లో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడం స్టాక్‌ సూచీలను లాభాల బాట పట్టించింది. ప్రధాన స్టాక్‌ సూచీలు చెరో ఒక శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 318 పాయింట్లు పెరిగి 33,352 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88 పాయింట్లు వృద్ధి చెంది 10,243 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 407 పాయింట్ల లాభంతో 33,440 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కదలాడింది. బ్యాంక్, వాహన, ఐటీ షేర్లలో కొనుగోళ్లు బాగా జరిగాయి. నిఫ్టీ 10,200 పాయింట్లపైకి ఎగబాకింది. ఇంట్రాడేలో 116 పాయింట్ల లాభంతో 10,270 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,413 పాయింట్లు పతనమైంది. గత ఆరు రోజుల నష్టాల నుంచి మార్కెట్‌ రివకరీ అయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడం ర్యాలీకి తోడ్పాటునందించిందని పేర్కొన్నారు. ఇది సాంకేతికంగా పెరుగుదల మాత్రమేనని, ఈ ర్యాలీ కొనసాగడం కష్టమేనని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ సందేహం వ్యక్తం చేశారు. వచ్చే వారం వెలువడే ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలను బట్టి ఇన్వెస్టర్లు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. 

ఎస్‌బీఐ 4 శాతం అప్‌..
ఎస్‌బీఐ 4 శాతం లాభపడి రూ.257 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా పెరిగిన షేర్‌ ఇదే. ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, పవర్‌ గ్రిడ్, హీరో మోటొకార్ప్, బజాజ్‌ ఆటో షేర్లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, సన్‌ ఫార్మా, యస్‌ బ్యాంక్, టీసీఎస్, టాటా మోటార్స్, కోటక్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీలు క్షీణించాయి.

భూషణ్‌ స్టీల్‌ 16 శాతం అప్‌...
దివాలా ప్రక్రియలో ఉన్న భూషణ్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి అత్యధిక బిడ్‌ కోట్‌ చేసిన కంపెనీగా టాటా స్టీల్‌ నిలిచిందని వెల్లడి కావడంతో భూషణ్‌ స్టీల్‌ షేర్‌ 16 శాతం లాభపడి రూ. 47 వద్ద ముగిసింది. మరోవైపు టాటా స్టీల్‌ షేర్‌ 2 శాతం నష్టపోయింది. ఉక్కు, అల్యూమినియం షేర్లు లాభపడ్డాయి. నాల్కో,హిందుస్తాన్‌ జింక్‌  షేర్లు 2 శాతం వరకూ పెరిగాయి. జిందాల్‌ స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీలు 1 శాతం వరకూ లాభపడ్డాయి. 

ఏడాది కనిష్టానికి టాటా మోటార్స్‌..
మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకున్నప్పటికీ, టాటా మోటార్స్‌తో సహా బీఎస్‌ఈ 500 సూచీలో 49 షేర్లు ఇంట్రాడేలో తాజా ఏడాది  కనిష్ట స్థాయిలను తాకాయి. లుపిన్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, కజారియా సిరామిక్స్, బాష్, గ్లాక్సో స్మిత్‌లైన్‌ ఫార్మా, అదానీ పవర్, ఆర్‌ఈసీ, సీమెన్స్, పీఎఫ్‌సీ ఈ జాబితాలో ఉన్నాయి. వేల్యూ బయింగ్, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగినప్పటికీ, ఇంట్రాడేలో 14 ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు కూడా తాజా ఏడాది కనిష్టాన్ని తాకాయి. కర్ణాటక బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, అంధ్రా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర,  లక్ష్మీ విలాస్‌ బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్,  విజయ బ్యాంక్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. 

తొలగిన వాణిజ్య యుద్ధాల భయాలు 
అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో ఇటీవల ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ సుంకాల నుంచి మెక్సికో, కెనడాలతో పాటు మరికొన్ని దేశాలకు మినహాయింపులు లభించే అవకాశాలున్నయని వార్తలు వచ్చాయి. దీంతో వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయేమోనన్న ఆందోళనలు తగ్గాయి. దీంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లు పెరగడం మన మార్కెట్‌కు ఉత్తేజాన్నిచ్చింది.  

మరిన్ని వార్తలు