బ్యాంకింగ్‌ నుంచి పావుశాతం రేటు కోత

7 Aug, 2017 00:29 IST|Sakshi
బ్యాంకింగ్‌ నుంచి పావుశాతం రేటు కోత

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా  
న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ తానిచ్చే రుణాలపై వడ్డీరేటును పావుశాతం వరకూ తగ్గించే వీలుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా– మెరిలించ్‌ (బీవోఏఎంఎల్‌) అంచనా వేసింది. ఇండస్ట్రియల్‌ బిజీ సీజన్‌– అక్టోబర్‌ నెల ప్రారంభం అయ్యేనాటికే ఈ నిర్ణయం తీసుకునే వీలుందని వివరించింది. రుణ వృద్ధికి ఇది దోహ దపడుతుందని అంచనావేసింది.

 ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను ఆగస్టు 2వ తేదీన 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– ఈ అంశంపై తాజా నివేదికను ఆవిష్కరించింది. బ్యాంకింగ్‌ తనకు రెపో ద్వారా అందిన రేటు ప్రయోజనాన్ని ఆటో, గృహ నిర్మాణ రంగాలకే కాకుండా మిగిలిన రంగాలకూ అందించాల్సిన అవసరం ఉందని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలను సైతం నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది.

అదే విధంగా డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వద్ద భారీ నగదు లభ్యత (లిక్విడిటీ) ఉండడాన్నీ ఉటంకించింది. మరికొంతకాలం ద్రవ్యోల్బణం దిగువస్థాయిలోనే కొనసాగే వీలుందని పేర్కొంది. జూలై రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2 శాతంగా అంచనా వేసింది. ఇక డిసెంబర్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ  రెపోను మరోశాతం తగ్గించే వీలుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు