ఎల్‌టీసీజీ భారం ఫండ్‌ ఇన్వెస్టర్లపై ఎంత?

12 Mar, 2018 00:34 IST|Sakshi

మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్ల తరçఫున షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు నిర్వహిస్తారు కదా! ఇప్పుడు తాజా గా వచ్చిన దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌)ను మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు కూడా  చెల్లించాలా ? ఇది మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందా ? – రవికాంత్, విజయవాడ  
పోర్ట్‌ఫోలియో తరఫున మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు షేర్లు విక్రయించినా, కొన్నా...అది ఇన్వెస్టర్ల తరఫునే. ఆందుచేత ఫండ్‌ ద్వారా ఒనగూరే లాభనష్టాలు..ఫండ్స్‌ చేసే చెల్లింపులు అన్నీ ఎన్‌ఏవీలో ప్రతిబింబిస్తాయి. ఈ ఎన్‌ఏవీ ఆధారంగానే ఇన్వెస్టర్ల పెట్టుబడులు వుంటాయి. ఇక  దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ)ను ఫండ్‌ మేనేజర్లు చెల్లించరు. మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించిన ఇన్వెస్టర్లే ఈ పన్నును చెల్లించాల్సివుంటుంది.

ఇక మీరు ఎప్పుడు ఇన్వెస్ట్‌ చేశారు అనే అంశాన్ని బట్టి మీరు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మొత్తం నిధుల్లో 65 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను ఏడాది లోపు విక్రయిస్తే మీరు మీకు వచ్చిన రాబడులపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఏడాది తర్వాత ఈ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయిస్తే, మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఇప్పటి వరకూ ఉండేది  కాదు. కానీ ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను ఏడాది తర్వాత విక్రయిస్తే, మీకు లక్షకు పైగా లాభాలు వస్తే,  ఆ లాభాలపై 10 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
నా వయసు 50 సంవత్సరాలు. ప్రస్తుతం నా దగ్గర రూ.3 లక్షలున్నాయి. పదేళ్ల తర్వాత నెల వారీ నాకు కొంత ఆదాయం కావాలంటే ఈ మూడు లక్షలను నేను ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి ?  
– రియాజ్, హైదరాబాద్‌
రిటైరైన తర్వాత నెలవారీ ఆదాయం కావాలంటే రెండు మార్గాలున్నాయి. మొదటిది. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం. ఇక రెండోది ఏదైనా బ్యాలన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం. ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌)..రిటైర్మెంట్‌ అవసరాల కోసం సులభంగా ఉండే ప్లాన్‌ ఇది. ఈ మూడు లక్షలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. అంతే కాకుండా మీరు పనిచేసినంత కాలమూ మీరు పొందే ఆదాయంలో నెలకు కొంత మొత్తాన్ని ఎన్‌పీఎస్‌కు కేటాయించండి.

మీకు 65 సంవత్సరాలు వచ్చే వరకూ మీరు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఆ తర్వాత ఎన్‌పీఎస్‌లో జమ అయిన మొత్తం మీకు పెన్షన్‌గా లభిస్తుంది. దీంట్లో  60 శాతం మాత్రమే మీకు ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవడానికి వీలవుతుంది. మిగిలిన దాంట్లో నెలకు కొంత మొత్తం చొప్పున మీకు పెన్షన్‌గా వస్తుంది. మీకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఇష్టం లేకపోతే, మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

కాబట్టి, ముందుగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. మీ దగ్గరున్న మొత్తం మూడు లక్షలను ఒకేసారి ఏక మొత్తంగా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవద్దు. స్టాక్‌ మార్కెట్‌ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకూడదనేది మొదటి సూత్రం. ఈ మూడు లక్షలను 12 భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని ఒక నెల చొప్పున బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.

ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఈ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో కనీసం ఏడు నుంచి ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేస్తే మీరు రిటైరైన తర్వాత తగిన మొత్తంలో పెన్షన్‌ పొందగలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్, టాటా బ్యాలన్స్‌డ్, ఎస్‌బీఐ బ్యాలన్స్‌డ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు.  

వన్‌ టైమ్‌ మాండేట్‌(ఓటీఎమ్‌) అంటే ఏమిటి ?   – మేరీ, విజయవాడ  
వన్‌ టైమ్‌ మాండేట్‌(ఓటీఎమ్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన సొమ్ములను చెల్లించే ఒక ప్రత్యామ్నాయ విధానం. మీరు ఒక మ్యూచువల్‌ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుందాం. ఆ మొత్తానికి సరపడా చెక్కును ప్రతినెలా సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు పంపించడమో, లేకపోతే సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు వెళ్లి డబ్బులు చెల్లించడమో కొంత వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీనికి బదులుగా వన్‌టైమ్‌ మాండేట్‌ ద్వారా మీ సిప్‌ మొత్తాన్ని సులభంగా, సత్వరంగా సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు చెల్లించవచ్చు. 

బ్యాంక్‌ ఖాతా నుంచి ఆ సిప్‌ మొత్తాన్ని డెబిట్‌ చేసుకునే అధికారాన్ని సదరు మ్యూచువల్‌ ఫండ్‌కు ఇవ్వడమే వన్‌ టైమ్‌ మాండేట్‌. ఈ ఓటీఎమ్‌ ఫెసిలిటి కోసం  మీ బ్యాంక్‌లో నమోదు చేసుకోవాలి. మీ సిప్‌ మొత్తం రూ.10,000 లేదా రూ.5,000 ఇలా ఎంత మొత్తంలో మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారో,  అంత మొత్తాన్ని సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ మీ బ్యాంక్‌ ఖాతా నుంచి డెబిట్‌ చేసుకొని ఫండ్‌ మేనేజర్‌ వ్యూహాల ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఓటీఎమ్‌ దరఖాస్తును తీసుకొని, సంబంధిత వివరాలు, మీ బ్యాంక్‌ ఖాతా, చెల్లించాల్సిన మొత్తం, ఎన్ని నెలలు తదితర వివరాలను నింపి, బ్యాంక్‌కు సమర్పిస్తే సరిపోతుంది.   

- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు