మీ గోల్.. హిట్ అవుతుందా?

6 Nov, 2017 01:44 IST|Sakshi

లక్ష్యాలు స్మార్ట్‌గా ఉంటేనే సాధించగలం

సమయం.. సాధ్యాసాధ్యాలు తప్పనిసరి

పొదుపు, పెట్టుబడుల్లో క్రమశిక్షణా ఉండాలి

ఆర్థికమైనా, ఇతరత్రా అయినా ఇవే ప్రధానం

లక్ష్యం లేకుండా ఇన్వెస్ట్‌ చేసేవారు.. గమ్యం లేని ప్రయాణీకులు ఒకటేనట!! అలాగని లక్ష్యాలు నిర్దేశించుకోవడం అంత ఈజీ కాదు. దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది. ఏంటా ప్రక్రియ? స్మార్ట్‌గా ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఎలా? ఒకసారి చూద్దాం...

మీ స్నేహితుడో, సహోద్యోగో సడన్‌గా మిమ్మల్ని ఓ ప్రశ్నడిగాడనుకోండి!! ‘‘భవిష్యత్తులో ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడనుకోండి. మీరేం చెబుతారు? మీరేకాదు... చాలామంది చెప్పే జవాబు ఒక్కటే. ‘సంపన్నులుగా ఉండాలనుకుంటున్నాం’ అని. కానీ సంపదంటే ఎంత? ఆస్తులపరంగానా లేక నగదు రూపంలో సంపద సమకూర్చుకోవాలని అనుకుంటున్నారా? ఓ రెండు మూడు ఇళ్లో.. లేదా ఓ పెద్ద ఫాంహౌస్‌ లాంటిది సంపాదించడమా... లేదా రిటైర్మెంట్‌ నాటికి రెండు మూడు కోట్లు దగ్గరపెట్టుకోవడమా... లేదా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేరో రూ.50 లక్షలు దాచిపెట్టడమా? మన ఆర్థిక లక్ష్యాలపై మనకు సరైన అవగాహన లేకపోతే.. ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి. కాబట్టే ముందుగా ఆర్థిక లక్ష్యాలు ప్లాన్‌ చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడే సాధించే మార్గాన్ని రూపొందించుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రణాళికను వేసుకోవడానికి కొన్ని స్మార్ట్‌ సూచనలున్నాయి. అసలు ఆర్థికపరమైనవే కాదు... ఇతరత్రా ఏ లక్ష్యాలకైనా సరే! ఈ అంశాలు జోడిస్తే.. స్మార్ట్‌ లక్ష్యంగా మారుతుంది.


నిర్ధిష్ట సమయమూ ముఖ్యమే...
సంపన్నులం కావాలనుకోవడం కూడా లక్ష్యమే కానీ.. కచ్చితమైన స్మార్ట్‌ గోల్‌ కాదు. ‘నేను రిటైర్‌ అయిన తర్వాత కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాను‘ అంటూ ఒక కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కీలకం. ఇక్కడ సంపన్నులుగా కావాలనుకోవడంతో పాటు నిర్ధిష్ట సమయాన్ని కూడా నిర్దేశించుకున్నాం. దీనికి మరికొన్ని అంశాలు కూడా జోడిస్తే స్మార్ట్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లే.


అంకెల్లోకి మార్చుకోవాల్సిందే...
కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దానికంటూ ఒక సంఖ్యాపరంగా ఒక అంకెను కేటాయించుకోవాలి. ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను! అనే లక్ష్యానికి అందుకోసం ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారన్నది నిర్దేశించుకోవాలి. అఫ్‌కోర్స్‌!! ఇదేమీ చెప్పినంత సులువైన వ్యవహారమేమీ కాదు. భవిష్యత్‌లో తలెత్తే ఖర్చులను అంచనా వేసుకుని ఎంత మొత్తం అవసరం అవుతుందనేది లెక్కించుకోవడం కష్టమైన వ్యవహారమే.

అయితే, దీనికో మార్గం ఉంది. ధరలు పెరుగుతున్న తీరు, వడ్డీ రేట్లు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ ధరల పెరుగుదల అనేది కూడా ఒకో అంశంలో ఒకో రకంగా ఉంటుంది. ఉదాహరణకు కార్ల రేట్ల పెరుగుదల కన్నా విద్యా వ్యయంలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు ఎంత మొత్తం కావాల్సి ఉంటుందనేది ఆయా అంశాలను బట్టి లెక్కేసుకోవాలి. కావాలంటే నిపుణుల సలహాను తీసుకోవచ్చు. ఉదాహరణకు మన ఆర్థిక లక్ష్యాలు ఓ రూ.10 లక్షలు పెట్టి కొత్త కారు, రూ.50 లక్షలు పెట్టి సిటీలో ఓ ఇల్లు కొనుక్కోవటం అనుకుందాం. అంటే దేని కోసం ఎంత కావాలి అనేదానిపై ఒక స్పష్టత వచ్చినట్లవుతుంది.


ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?
స్మార్ట్‌ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి ఎవరికి వారు వేసుకోవాల్సినవి ఓ మూడు ప్రశ్నలున్నాయి. అవి...
♦ ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకున్నామా?
♦  అవి స్మార్ట్‌ లక్ష్యాలేనా?
♦  ఆర్థిక లక్ష్యాల ప్రాధాన్య క్రమంలో తగు ప్రణాళికను అమలు చేస్తున్నామా లేదా?

ఒకవేళ ఈ మూడింటిలో దేనికైనా సరే సమాధానం ‘లేదు‘ అని గానీ వస్తే.. తక్షణమే ఓ పెన్నూ, పేపరు పట్టుకుని కూర్చోండి. లక్ష్యాలను, గడువును, సాధించేందుకు పాటించాలనుకుంటున్న ప్రణాళికలను రాసి పెట్టుకోండి. నిరంతరం మీ లక్ష్యాలను గుర్తు చేస్తుండేలా సదరు షీట్‌ ఎదురుగా ఉండేలా చూసుకోండి. క్రమశిక్షణతో పొదుపు, పెట్టుబడులు చేస్తూ అంచెలంచెలుగా లక్ష్యాల సాధన దిశగా ముందడుగు వేయండి.


సాధించగలిగేవిగా ఉండాలి..
ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుంటే సరిపోతుందా? లేదు! లక్ష్యాలు గాల్లో మేడల్లాగా ఉండకూడదు. ఆచరణ సాధ్యమయ్యేవిగా, సాధించగలిగేవిగా కూడా ఉండాలి.
♦ ఆయా ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే నిర్ధిష్ట సమయం కూడా కచ్చితంగా నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు అయిదేళ్లలో కారు కొనుక్కోవాలనుకుంటున్నాను అనో లేదా పదేళ్లలో సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాననో.. ఇలా కొంత గడువు పెట్టుకోవాలి.
♦ మరోవైపు లక్ష్యాల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక క్రమంలో ఆయా లక్ష్యాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది కూడా నిర్దేశించుకోవాలి.


స్వల్పకాలిక లక్ష్యాలు..
♦ కుటుంబానికి అత్యవసర నిధి ఏర్పాటు
♦ స్కూల్‌ అడ్మిషన్‌ సంబంధ ఖర్చులు
♦  ఏదైనా గృహోపకరణం కొనటం... లేదా ఇతరత్రా చికిత్స వ్యయాలు
♦ జీవిత బీమా ప్రీమియంల చెల్లింపు
♦పన్నులపరమైన ప్రణాళికలో భాగంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌


మధ్యకాలిక లక్ష్యాలు..
♦ రుణభారం తగ్గించుకోవడం
♦ కుటుంబంతో విహారయాత్రకు వెళ్లటం
♦ మంచి కాలేజీల్లో పిల్లల చదువులు
♦ పెరిగే కుటుంబ అవసరాలు
♦ కొత్త వాహనం కొనుక్కోవడం
♦ ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు


దీర్ఘకాలిక లక్ష్యాలు
♦ రిటైర్మెంట్‌ నిధి సమకూర్చుకోవడం (వైద్య ఖర్చులు కూడా కలిపి)
♦ వారసులకు కొంత ఆస్తిని వారసత్వంగా ఇవ్వటం
♦ కుమార్తెల పెళ్లిళ్లు
♦ విశ్రాంత జీవనానికి ఇల్లు లేదా  ఫాంహౌస్‌ లాంటివి కొనటం

మరిన్ని వార్తలు