1,325 డాలర్లు దాటితేనే అప్‌ట్రెండ్‌

28 May, 2018 00:27 IST|Sakshi

బంగారంపై నిపుణుల విశ్లేషణ

బంగారం మే 25 శుక్రవారంతో ముగిసిన వారంలో తిరిగి కీలకమైన 1,300 డాలర్లను దాటింది. అయితే అప్‌ట్రెండ్‌ కొనసాగడంపై మాత్రం సందేహాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే, అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో బంగారం ఔన్స్‌  (31.1గ్రా) ధర 18వ తేదీతో ముగిసిన వారంలో 27 డాలర్లు పడిపోయి, 1,291 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది పసిడి 1,300 డాలర్ల కీలక మద్దతును కోల్పోవడం అదే తొలిసారి. (2017 జనవరి నుంచీ పసిడి 1,300–1,370 డాలర్ల శ్రేణిలో తిరిగింది.) అయితే మే 25వ తేదీతో ముగిసిన వారంలోనే తిరిగి 10 డాలర్ల పెరుగుదలతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. 

అమెరికా–ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య చర్చల రద్దు, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ రేట్ల పెంపు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి)పై అనిశ్చితి వార్తలు ఇందుకు ప్రధాన కారణాలు. పసిడి 200 డీఎంఏ (డైలీ మూవింగ్‌ యావరేజ్‌)  1,307 డాలర్లు. 1,325 డాలర్లు దాటితేనే అప్‌ట్రెండ్‌ ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టతను కూడా ఇక్కడ నిపుణులు ఉదహరిస్తున్నారు.

డాలర్‌ ఇండెక్స్‌ వారంలో 0.75 పెరిగి 94.21 వద్ద ముగిసింది. రానున్న ఒకటి రెండు వారాల్లో పసిడి 1,325 డాలర్లు దాటి స్థిరపడని పరిస్థితి ఉంటే,  సమీపకాలంలో 1,240 డాలర్ల స్థాయిని చూసే అవకాశం ఉంటుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. తక్షణం ఎగువున 1,310 డాలర్లు నిరోధం కాగా, 1,270 డాలర్లు తక్షణ మద్దతని వారి విశ్లేషణ.  

దేశీయంగానూ లాభాలు..
ఇక అంతర్జాతీయ పటిష్ట ధోరణి, దేశీయంగా డిమాండ్, రూపాయి బలోపేతం (28 పైసలు లాభంతో 67.72) వంటి అంశాల నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల పసిడి ధర వారం వారీగా  రూ.98 లాభపడి రూ.31,189 వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత వారంలో రూ.260 చొప్పున పెరిగి వరుసగా రూ. 31,355, రూ.31,205 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.510 పెరిగి రూ.40,305 చేరింది.   

మరిన్ని వార్తలు