ఫలితాలు.. క్రూడ్‌ వైపు చూపు

30 Apr, 2018 00:05 IST|Sakshi

మే 1 మార్కెట్‌కు సెలవు 

ట్రేడింగ్‌ నాలుగు రోజులే  

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు  

హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ, అమెరికా  ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం   ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, మే డే సందర్భంగా మే 1న(మంగళవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరుగుతుంది.  

గణాంకాలు, ఫలితాలు  
ఈ వారంలో తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎమ్‌ఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) గణాంకాలు వస్తాయి. ఈ గణాంకాల ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ఉంటుంది.  ఏప్రిల్‌ నెల తయారీ రంగ గణాంకాలు వచ్చే నెల 2న(బుధవారం) వస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.1గా ఉన్న నికాయ్‌ మాన్యుఫాక్చరింగ్‌ పీఎమ్‌ఐ గత నెలలో 51కు తగ్గింది. ఈ నెల సేవల రంగ పీఎమ్‌ఐ గణాంకాలు వచ్చే నెల 4న(శుక్రవారం) వెలువడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 47.8గా ఉన్న మార్కిట్‌ ఎకనామిక్స్‌ పీఎమ్‌ఐ గత నెలలో 50.3కు ఎగసింది. ఇక ఈ వారంలో దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడతాయి. నేడు(సోమవారం) హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫలితాలు వెలువడతాయి. వచ్చే నెల 2న(బుధవారం) హీరో మోటొకార్ప్, హెచ్‌సీఎల్‌ టెక్‌ల ఫలితాలు వస్తాయి. గురువారం(వచ్చే నెల 3న) వేదాంత,  4న అంబుజా సిమెంట్స్‌ ఫలితాలు వెలువడతాయి.  టాటా పవర్, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్, అదానీ పవర్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తదితర కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి.  

వెలుగులో రిలయన్స్‌.. 
గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలు ఆశావహంగానే ఉండటంతో ఈ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వాహన విక్రయాలను కంపెనీలు వెల్లడించనున్నందున వాహన కంపెనీల షేర్లపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది.   కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఎన్నికలు మార్కెట్‌పై ప్రభావం చూపించే కీలకాంశాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. దేశీయ ఆర్థిక అంశాలపై ప్రభావం చూపించే ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలను ఇన్వెస్టర్లు గమనించాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. ఫలితాల సీజన్‌ సానుకూలంగా ఆరంభమైందని, ఇప్పటివరకూ వెల్లడైన ప్రైవేట్‌ బ్యాంక్‌లు, ఐటీ కంపెనీల ఫలితాలను అంచనాలను మించాయని వివరించారు. వచ్చే నెల 1 (మంగళవారం) నుంచి ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల సమావేశం ఆరంభం కానున్నదని, ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ ఈ సమావేశ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. బాండ్ల (అమెరికా, భారత్‌)రాబడుల తీరు ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు సంజీవ జర్బాడే పేర్కొన్నారు.  మే రెండు వారంలో జరిగే కర్నాటక ఎన్నికలు సమీప కాలంలో మార్కెట్‌కు ముఖ్యమైనదని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మార్కెట్‌ అటో, ఇటో తేలుతుందని, అప్పటివరకూ పరిమిత శ్రేణిలోనే స్టాక్‌ సూచీల  కదలికలు ఉంటాయని వివరించారు.  

రూ.15,558 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు...
విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ రూ.15,588 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డాలర్‌తో రూపాయి మారకం బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దీనికి కీలక కారణాలని వారంటున్నారు. డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.5,552 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.10,036 కోట్లు చొప్పున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.8,460 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టగా, రూ.10,810 కోట్లు డెట్‌ మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు