పాప కోసం.. ఏ ఫండ్‌ బెటర్‌?

2 Sep, 2019 11:22 IST|Sakshi

నాకు నెల క్రితమే ఒక పాప పుట్టింది. ఆమెను డాక్టర్‌ చెయ్యాలనేది నా కల. ఆమె భవిష్యత్తు కోసం ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? సిప్‌ మొదలు పెట్టే ప్రక్రియ సంబంధిత వివరాలు తెలియజెయ్యండి? –రఘువీర్, హైదరాబాద్‌ 

ఒక పాపకు తండ్రి అయినందుకు ముందుగా మీకు అభినందనలు. ఆమె భవిష్యత్తు కోసం సిప్‌ విధానంలో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడం మంచి నిర్ణయం. సిప్‌ కోసం మంచి మల్టీ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోండి. సిప్‌ మొదలు పెట్టే ప్రక్రియ చాలా సులువైనదే. మీరు మొదటి సారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, ముందుగా నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ)ప్రక్రియ పూర్తి చెయ్యండి. మీ పాప పేరు మీద ఫండ్‌ను ఓపెన్‌ చేయవచ్చు. మీ పాప పేరు మీదే ఈ ఫండ్‌ ఉన్నప్పటికీ, మీ బ్యాంక్‌ ఖాతా నుంచి సొమ్ములు ఈ ఫండ్‌లోకి వెళ్లిపోతాయి. మీ పర్యవేక్షణ ఉంటుంది. మొదట్లో కొంచెం గందరగోళంగా ఉన్నా, ఆ తర్వాత మీకు సులభంగానే అవగాహన అవుతుంది.  ఇక మల్టీ క్యాప్‌ ఫండ్‌ విషయానికొస్తే, దీంట్లో  రెగ్యులర్‌ ప్లాన్‌ కంటే కూడా డైరెక్ట్‌ ప్లాన్‌నే ఎంచుకోండి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, రెగ్యులర్‌ ప్లాన్‌ కన్నా, డైరెక్ట్‌ ప్లాన్‌లోనే ఒకింత అధికంగా రాబడులు వస్తాయి. మీ పాప భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేయడానికి ఒక మల్టీ క్యాప్‌ ఫండ్‌  సరిపోతుంది. కనీసం ఏడాదికో, రెండేళ్లకే సిప్‌ మొత్తాన్ని పెంచుతూ ఉండండి. మార్కెట్‌ పతనబాటలో ఉన్నా సరే, మీ సిప్‌లను కొనసాగించండి. ఏడాదికి 10 శాతం సిప్‌ మొత్తాన్ని పెంచితే మంచిది. దీని కోసం స్టెప్‌–అప్‌–సిప్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి. ప్రతి ఏడాది కొంత మొత్తం సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచనున్నట్లు మొదట్లోనే అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీకి సమాచారమివ్వాలి. మీ ఆదాయం పెరిగినా, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. కాబట్టి పది శాతం పెట్టుబడులను ప్రతి ఏటా పెంచాలి. మార్కెట్‌ బాగా పెరుగుతున్నా, బాగా తగ్గుతున్నా, మార్కెట్‌  ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా సిప్‌ పెట్టుబడులను కొనసాగించండి.  ఇప్పటినుంచే ఇన్వెస్ట్‌ చేస్తే, మీ పాపను డాక్టర్‌ చేయాలన్న మీ స్వప్నం సాకారమవుతుంది.  

ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ల్లో మూడు నుంచి ఆరు నెలల కాలమే ఇన్వెస్ట్‌ చేయాలా? ఆరు నెలల తర్వాత పెట్టుబడులను వెనక్కి  తీసుకోవాలా? ఆరు నెలలకు మించి, దీర్ఘకాలం పాటు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకూడదా? –పర్వీన్, విశాఖపట్టణం  
ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌లో మూడు నుంచి ఆరు నెలల కాలానికి మించి ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఆరు నెలల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకోవలసిన అవసరమేమీ లేదు. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల స్వల్ప కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలంటే, ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను సూచిస్తాం. ఇది ఓపెన్‌–ఎండెడ్‌ ఫండ్‌. మీరు ఎప్పుడైనా ఈ ఫండ్‌ నుంచి వైదొలగవచ్చు. సాధారణంగా ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, నష్టాలు రావు. ఒక వేళ మూడు నుంచి ఆరు నెలల కాలానికి  గనుక ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, లిక్విడ్‌ ఫండ్‌లేదా ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. ఈ రెండు ఫండ్స్‌ ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లా సురక్షితమే, కానీ ఈ రెండు ఫండ్స్‌ కంటే కూడా ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనే ఒకింత ఎక్కువ రాబడులు వస్తాయి. దీర్ఘకాలం.. మూడేళ్లు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మల్టీ క్యాప్‌ ఫండ్‌ను గానీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ను గానీ ఎంచుకోండి. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్స్‌ను ఎంచుకుంటే, పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 

గత రెండేళ్లుగా ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఈ ఫండ్‌ పనితీరు సంతృప్తికరంగా లేదు. ఈ ఫండ్‌ రాబడులు 5–6 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ ఫండ్‌ కంటే యాక్సిస్‌ బ్లూ చిప్‌ ఫండ్‌ మెరుగైన రాబడులనిస్తోంది. అందుకని నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్‌ నుంచి యాక్సిస్‌ బ్లూ చిప్‌ ఫండ్‌లోకి మార్చాలనుకుంటున్నాను. నాది  సరైన నిర్ణయమేనా?  –మాధ్యూస్, నెల్లూరు  
ఇటీవల కాలంలో ఎస్‌బీఐ బ్లూ చిప్‌ ఫండ్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్న మాట వాస్తవమే. ఒక్క ఈ ఫండే కాదే, ఈ కేటగిరీలోని పలు ఫండ్స్‌ పనితీరు గత రెండేళ్ల కాలంలో ఏమంత చెప్పుకోదగిన స్థాయిలో లేదు. అయితే స్వల్ప కాలం పనితీరును పరగణనలోకి తీసుకొని ఈ ఫండ్‌ నుంచి వైదొలగాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్‌అనేది మంచి లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌. దీంట్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు కనీసం ఐదేళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్‌ చేయాలి. మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పటికీ, ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీరు దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు.

మరిన్ని వార్తలు