రేటు కోతకే ఆర్‌బీఐ మొగ్గు!

29 Sep, 2015 01:54 IST|Sakshi
రేటు కోతకే ఆర్‌బీఐ మొగ్గు!

- నేటి ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 29వ తేదీ మంగళవారం కీలక నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ కీలక రెపో రేటును తగ్గిస్తుందని, తద్వారా వృద్ధికి చేయూతను అందిస్తుందని నిపుణులు, ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సైతం రేటుకోతనే కోరుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో అందరి  కళ్లూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వైపునకు మళ్లాయి.  బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే... రెపో. ప్రస్తుతం ఈ రేటు 7.25 శాతం. మంగళవారం కనీసం పావుశాతం రేటు కోత ఉంటుందని బ్యాంకర్లుసహా పలు వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇదే జరిగితే రెపో నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లవుతుంది. 

ఈ ఏడాది ఆర్‌బీఐ మూడుసార్లు రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే బ్యాంకులు ఈ ప్రయోజనంలో 33 శాతాన్నే కస్టమర్లకు బదలాయించాయి. రెపో ద్వారా వచ్చిన  ప్రయోజనాన్ని బ్యాంకులు మరింతగా కస్టమర్లకు బదలాయించాలని  రాజన్ పేర్కొంటున్నారు. దీనికితోడు ద్రవ్యోల్బణం భవిష్యత్తులో సైతం తక్కువగా ఉంటుందని భావిస్తేనే రేటు కోత ఉంటుందనీ  సూచిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో రాజన్ రేటుకోతకు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న వారి అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే...

టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లో ఉండడం. ఆగస్టులో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 10 నెలల కనిష్ట స్థాయిలో క్షీణతను నమోదుచేసుకుంది. -4.95 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 3.66 శాతంగా నమోదయ్యింది. క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం వల్ల సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై ఈ ప్రతికూల ప్రభావం ఉండదు. దేశంలో టోకు ధరలకు సంబంధించి ప్రతి ద్రవ్యోల్బణమే ఇప్పుడు సవాలని ఆర్థికశాఖ ఉన్నత స్థాయి అధికారులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయంగా ప్రత్యేకించి చైనా మందగమన పరిస్థితు లను పరిగణనలోకి తీసుకుని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్స్ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది.
ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి 7%కి పడిపోతుంది. కనీసం 7.5% స్థాయి లో 2015-16లో వృద్ధిని నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది.
చైనా మందగమన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సైతం తక్షణం రేటు కోత అవసరం.
 
తగిన అవకాశాలు...
రేటు కోతకు ప్రస్తుతం తగిన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆహార ధరల రేట్లు పెరిగినా... వాటి ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. అయితే ఎంత రేటు కోత ఉంటుందన్న విషయాన్ని మాత్రం చెప్పలేను.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
 
పావుశాతం కోత ఉండొచ్చు

రెపో రేటు పావుశాతం తగ్గుతుందని భావిస్తున్నా. అయితే వ్యవస్థలో తగిన ద్రవ్య లభ్యత అందుబాటులో ఉన్నందున, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియోల్లో మాత్రం మార్పులు ఉండకపోవచ్చు.
- అరుణ్ తివారీ, యూబీఐ చీఫ్
 
1% వరకూ తగ్గొచ్చు...
రెపో రేటును అరశాతం నుంచి ఒక శాతం శ్రేణిలో తగ్గించడానికి అనువైన సమయం ఇది. పారిశ్రామిక వృద్ధికి రేటు కోత అవసరం. ఆయా అంశాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం.
- అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్

>
మరిన్ని వార్తలు