డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

22 Jul, 2019 12:50 IST|Sakshi
ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఫండ్స్‌ ఎన్ ఏవీ(నెట్‌అసెట్‌వేల్యూ) ప్రస్తుతమున్న స్థాయి నుంచి ఎంత మేర పతనమైతే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు?
–శ్రీనివాస్, విజయవాడ 

మీకు ఈ విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. ఎన్ ఏవీ తగ్గేదాకా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మీరు చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కోసారి  ఈ వెయిటింగ్‌  నిరంతరం ఉండొచ్చు కూడా ! ఒకవేళ మార్కెట్‌ 20–25 శాతం పెరిగిందనుకోండి. మార్కెట్‌ మళ్లీ ఎప్పుడు పడిపోతుందా అని మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. దీనికి బదులుగా ఒక మదుçపు వ్యూహాన్ని అనుసరించండి. మీరు ఇన్వెస్ట్‌ చేయాల్సిన మొత్తంలో పది శాతాన్ని ప్రతి నెలా చివరి రోజు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఎన్ఏవీ తగ్గకపోయినా ఈ 10 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. మీరనుకున్నట్లుగా ఎ¯Œ ఏవీ పడిపోయేదాకా వేచి చూస్తూనే, ప్రతి నెలా 10 శాతం మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండండి.ఎన్ఏవీ పడేదాకా ఎదురుచూసి, ఆ తర్వాత ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వ్యూహం గతంలో పనిచేయలేదు. భవిష్యత్తులో కూడా పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.  ఏ ఫండ్‌ మేనేజర్‌ కూడా ఇలాంటి వ్యూహాన్ని పాటిస్తున్న దాఖలాలు అయితే లేవు. మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఒక్క డెట్‌ ఫండ్స్‌ మినహా, ఈక్విటీ, ఇతర ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ (సిప్‌)ల ద్వారా నెలా నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయడం మంచి మదుపు వ్యూహం. ఇలా చూస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. 

నేను ప్రతినెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. డైరెక్ట్‌ ప్లాన్ ను ఎంచుకోవాలా? రెగ్యులర్‌ ప్లాన్ ను ఎంచుకోవాలా?     –భార్గవి, విశాఖపట్టణం  
మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం డైరెక్ట్‌  ప్లాన్ ను ఎంచుకోవాలా ? రెగ్యులర్‌ ప్లాన్ ను ఎంచుకోవాలా అనేది పూర్తిగా మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు మ్యూచువల్‌ ఫండ్స్, వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి అవగాహన లేకపోతే, సలహాదారును గానీ, మ్యూచువల్‌ ఫండ్‌ ఏజెంట్‌ను గానీ సంప్రదించండి. రెగ్యులర్‌ ప్లాన్ లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదని వాళ్లు సలహా ఇస్తారు. మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌పై అవగాహన వుండి, ఆన్ లైన్ లో ఇన్వెస్ట్‌ చేయగలిగేటట్లుగా ఉంటే, ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, సదరు ఫండ్‌కు సంబంధించిన డైరెక్ట్‌ ప్లాన్ లో ఇన్వెస్ట్‌ చేయండి. రెగ్యులర్‌ ప్లాన్లతో పోల్చితే, డైరెక్ట్‌ ప్లాన్లలో వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా రెగ్యులర్‌ ప్లాన్ల కంటే డైరెక్ట్‌ ప్లాన్ ల్లో రాబడులు ఒకింత అధికంగా ఉంటాయి.

నేను గత రెండేళ్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ అనుభవంతో సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. అలాగే విదేశీ కంపెనీల షేర్లున్న ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనా ?     –శ్రీధర్, హైదరాబాద్‌  
సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఎలాంటి ఉపయోగం లేని పని అని నేను అనుకుంటున్నాను. ఒక్క కంపెనీలోనే ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, విభిన్న రంగాలకు చెందిన వివిధ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే డైవర్సిఫికేషన్ ? ప్రయోజనాలు లభిస్తాయి. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలుంటాయి కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే డైవర్సిఫికేష¯Œ  ప్రయోజనాలు పొందవచ్చు. ఫండ్‌లో ఒక రంగానికి చెందిన షేర్లను పెంచడం, తగ్గించడం వంటి అంశాలను ఆ ఫండ్‌ను నిర్వహించే ఫండ్‌ మేనేజర్‌ చూస్తాడు. భవిష్యత్తులో మంచి రాబడులు లక్ష్యంగా ఫండ్‌ మేనేజర్లు నిరంతరం ఈ కసరత్తు చేస్తూ ఉంటారు. సెక్టోరియల్‌ ఫండ్స్‌కు ఈ ప్రయోజనాలేమీ లభించవు. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియో అంతా ఒకే రంగానికి చెందిన కంపెనీలతో నిండి ఉంటుంది. అన్ని రంగాలు.... ఫార్మా, బ్యాంక్, వాహన... ఇలా ప్రతీ రంగం చక్రీయంగా ఉంటుంది. అంటే ఒక సమయంలో ఉచ్ఛస్థితిలో ఉన్న ఈ రంగం మరో సమయంలో పాతాళానికి పడిపోతుంది. దీనికనుగుణంగానే సెక్టోరియల్‌ ఫండ్స్‌ పనితీరు కూడా ఉంటుంది. ఒకప్పుడు మంచి రాబడులు ఇచ్చినా, మరొకసారి భారీ నష్టాలూ ఇవ్వొచ్చు. ఒక రంగం ఎప్పుడు బాగా ఉంటుందో, ఎప్పుడు అధ్వానంగా ఉంటుందో, సామాన్య ఇన్వెస్టరే  కాకుండే కొమ్ములు తిరిగిన ఫండ్‌ మేనేజర్‌ కూడా సరిగ్గా అంచనా వేయలేడు. ఉదాహరణకు ఫార్మా ఫండ్స్‌ మంచి పనితీరు చూపిస్తాయని ఆశిస్తే, అత్యంత అధ్వాన పనితీరు ఉన్న ఫండ్స్‌గా అవి అవతరించాయి.  వీటన్నింటి దృష్ట్యా సెక్టోరియల్‌ ఫండ్స్‌కు దూరంగానే ఉంటే మంచిది. ఇక విదేశీ కంపెనీల షేర్లున్న ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడం మంచి ఆలోచనే. ఇలాంటి ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మీకు డైవర్సిఫికేష¯Œ  ప్రయోజనాలు బాగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న గూగుల్, అమెజాన్ , యాపిల్‌ వంటి షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశమూ మీకు లభిస్తుంది. కొన్ని దేశీయ ఫండ్స్‌ తమ నిధుల్లో 35 శాతం మేర విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. అంతే కాకుండా పలు భారత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అమెరికా–డొమిసెల్‌ ఫండ్స్‌ను విక్రయిస్తున్నాయి. మీరు నాస్‌డాక్‌ ఫండ్, యూఎస్‌  ఆపర్చునిటీ ఫండ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు