విమాన టికెట్‌ చార్జీలకు రెక్కలు..

24 May, 2018 01:35 IST|Sakshi

పెరుగుతున్న ఏటీఎఫ్‌ ధరల ప్రభావం

చార్జీలు 10–15 శాతం 

పెరగొచ్చని అంచనా

ముంబై: గడిచిన ఏడాది కాలంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగిన నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పెరిగిపోతున్న నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు దేశీ విమానయాన సంస్థలు సుమారు 15 శాతం దాకా చార్జీలను పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 45 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. చార్జీలను పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మార్గాలపై విమానయాన సంస్థలు కసరత్తు చేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘గతేడాది నవంబర్‌ నుంచి ఇప్పటిదాకా జెట్‌ ఇంధనం ధర 25 శాతం దాకా పెరిగింది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకునేందుకు టికెట్‌ చార్జీలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితే. కానీ, ఎవరు ముందుగా పెంచుతారన్నదే ప్రశ్న‘ అని ఒక ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ అధికారి వ్యాఖ్యానించారు. బోలెడన్ని ఫ్లయిట్‌ సర్వీసులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రేట్లు పెంచితే ప్రయాణికులను కోల్పోవాల్సి వస్తుందని, పెంచకపోతే భారీ వ్యయాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. 

ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలి..: విమాన టికెట్ల చార్జీలు కనీసం 10–15% పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్‌నర్‌ అంబర్‌ దూబే తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటీఎఫ్‌పై ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను)ను సత్వరం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నన్నాళ్లు.. ఏవియేషన్‌ రంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయంగానే లబ్ధి పొందాయి. ఇప్పుడు ఎయిర్‌లైన్స్‌ విమానయాన సంస్థలకు తోడ్పాటునివ్వాల్సిన సమయం వచ్చింది‘ అని దూబే చెప్పారు. జూలై నుంచి సెప్టెంబర్‌ దాకా ఎయిర్‌లైన్స్‌కి కష్టకాలంగానే ఉండొచ్చన్నారు. గడిచిన ఏడాది కాలంగా చాలా మటుకు ఇంధన ధరల పెరుగుదల ప్రభావాలను విమానయాన సంస్థలే భరిస్తూ వస్తున్నాయని, ఇప్పుడు కొంతైనా ప్రయాణికులపై మోపక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ హెడ్‌ (బిజినెస్‌ ట్రావెల్‌ విభాగం) జాన్‌ నాయర్‌ తెలిపారు.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు