ఎగుమతులు... మళ్లీ నిరాశే!

16 May, 2015 01:51 IST|Sakshi
ఎగుమతులు... మళ్లీ నిరాశే!

ఏప్రిల్‌లో 14 శాతం క్షీణతతో 22 బిలియన్ డాలర్లగా నమోదు
వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో నిరాశపర్చాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2015 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14% క్షీణించాయి. 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. 2014 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 26 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే- ఎగుమతులు క్షీణ దశలో ఉండడం ఇది వరుసగా 5వ నెల.
 
దిగుమతులూ తగ్గాయ్..
ఇక ఇదే నెలలో దిగుమతులు కూడా 7 శాతం పైగా క్షీణించాయి. ఈ విలువ 36 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు దిగింది.
వాణిజ్యలోటు ఇదీ...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2014 ఏప్రిల్ ఈ పరిమాణం 10 బిలియన్ డాలర్లు కాగా 2015 మార్చిలో 12 బిలియన్ డాలర్లు.
 
మరిన్ని అంశాలు...
అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం.
పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు-ఆభరణాలు వంటి ప్రధాన ఎగుమతి విభాగాలు ప్రతికూల ఫలితాలు నమోదుచేసుకున్నాయి.
చమురు దిగుమతులు 43 శాతం తగ్గి, 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
చమురుయేతర దిగుమతులు 13 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు చేరాయి.
గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో దేశం 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 2013-14 కన్నా (314 బిలియన్ డాలర్లు) తక్కువగా 310.5 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి.
 
పసిడి మెరుపు...
కాగా ఏప్రిల్‌లో ఒక్క బంగారం దిగుమతుల విలువ చూస్తే 78 శాతం పెరిగి 3.13 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం విలువ తగ్గడం, నియంత్రణల సడలింపు వంటి అంశాలు దీనికి కారణం. 2014 ఏప్రిల్‌లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు 2015 ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు చేరడానికి బంగారం దిగుమతులు పెరగడమూ ఒక కారణం.

మరిన్ని వార్తలు