ఎగుమతులు పెరిగినా..  వాణిజ్యలోటు భయాలు

16 Nov, 2018 00:49 IST|Sakshi

అక్టోబర్‌లో 17.86 శాతం వృద్ధి

దిగుమతులూ భారీగానే

దీనితో 17.13 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు  

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు అక్టోబర్‌లో (2017 అక్టోబర్‌తో పోల్చి) 17.86 శాతం పెరిగాయి. విలువ రూపంలో చూస్తే 26.98 బిలియన్‌ డాలర్లు. అయితే ఇదే కాలంలో దిగుమతులు భారీగా 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 17.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. అక్టోబర్‌లో వాణిజ్యలోటు 14.61 బిలియన్‌ డాలర్లు.  గురువారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... 

►గత ఏడాది అక్టోబర్‌లో మరీ తక్కువ ఎగుమతు లు జరగడం (బేస్‌ఎఫెక్ట్‌) ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో వృద్ధి రేటు భారీగా కనబడ్డానికి కారణమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్, ఇంజనీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు వ్యాఖ్యానించడం గమనార్హం.  
►అక్టోబర్‌లో ఎగుమతులు పెరిగినా, నెలవారీగా చూస్తే తగ్గాయి. సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్‌ డాలర్లు.  
►  అక్టోబర్‌ ఎగుమతుల్లో మంచి ఫలితాలను సాధించిన రంగాల్లో పెట్రోలియం (49.3 శాతం), ఇంజనీరింగ్‌ (8.87 శాతం), రసాయనాలు (34 శాతం) ఫార్మా (13 శాతం), రత్నాలు, ఆభరణాలు (5.5 శాతం) వంటివి ఉన్నాయి.  
► అయితే కాఫీ, బియ్యం, పొగాకు, జీడిపప్పు, ఆయిల్‌సీడ్స్‌సహా పలు వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి.  
ఊ    అక్టోబర్‌లో చమురు దిగుమతులు 52.64 శాతం పెరిగి 14.21 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 6 శాతం పెరిగి 29.9 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. 

ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య... 
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య ఎగుమతులు 13.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 191 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు ఇదే కాలంలో 16.37 శాతం పెరిగి 302.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటి మధ్యా నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 111.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 91.28 బిలియన్‌ డాలర్లు. కాగా ఏప్రిల్‌– అక్టోబర్‌ మధ్య చమురు దిగుమతులు 50.48 శాతం పెరిగి 83.94 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

సెప్టెంబర్‌లో 19 శాతం పెరిగిన సేవలు... 
ఇదిలావుండగా, సెప్టెంబర్‌కు సంబంధించి సేవల రంగం గణాంకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ నెలలో సేవల ఎగుమతులు 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో 16.38 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 18 శాతం పెరిగాయి. విలువ 9.95 బిలియన్‌ డాలర్లు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ భారత్‌ సేవల ఎగుమతులు విలువ 101.07 బిలియన్‌ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 62.57 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

 భారీగా తగ్గిన పసిడి దిగుమతులు  
మరోవైపు అక్టోబర్‌లో పసిడి దిగుమతులు భారీగా 42.9 శాతం తగ్గాయి. విలువలో 1.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో పసిడి దిగుమతుల విలువ 2.95 బిలియన్‌ డాలర్లు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ పడిపోవడం పసిడి డిమాండ్‌ను తగ్గించింది. ఇది కరెంట్‌ అకౌంట్‌ లోటుకు ప్రతికూల అంశమే. ఆభరణాల పరిశ్రమ నుంచి ప్రధానంగా పసిడికి డిమాండ్‌ ఉంది. ఆభరణాల పరిశ్రమ నుంచి ఎగుమతులు ఈ నెల్లో 5.5 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 34.9 బిలియన్‌ డాలర్లు.  

>
మరిన్ని వార్తలు