ఎగుమతులు.. జన‘వర్రీ’!

16 Feb, 2019 00:01 IST|Sakshi

వృద్ధి కేవలం 3.74 శాతం

విలువలో 26.36 బిలియన్‌ డాలర్లు

దిగుమతుల విలువ 41 బిలియన్‌ డాలర్లు

వాణిజ్యలోటు 15 బిలియన్‌ డాలర్లు

38 శాతం పెరిగిన పసిడి దిగుమతులు  

న్యూఢిల్లీ : భారత్‌ ఎగుమతులు జనవరిలో నిరాశను మిగిల్చాయి. 2018 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి రేటు కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. విలువ 25.51 బిలియన్‌ డాలర్ల నుంచి 26.36 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక ఇదే సమయంలో దిగుమతులు 41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం...

►ఇంజనీరింగ్‌ (1 శాతం వృద్ధి), తోలు, రత్నాలు (0.33 శాతం), ఆభరణాల (6.67 శాతం) ఎగుమతులు తగ్గాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు అసలు పెరక్కపోగా 19 శాతం క్షీణించాయి. 
►2018 జనవరితో పోల్చితే(15.67 బిలయన్‌ డాలర్లు) వాణిజ్యలోటు తగ్గినా, 2018 డిసెంబర్‌లో పోల్చితే  (13 బిలియన్‌ డాలర్లు) పెరిగింది.
►  జనవరిలో చమురు దిగుమతులు 3.59 శాతం పెరిగి 11.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 10 నెలల కాలంలో 36.65 శాతం పెరిగి 119.34 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక చమురుయేతర దిగుమతులు ఇదే సమయంలో 3.59 శాతం పెరిగి 308.39 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 
► పసిడి దిగుమతులు 38.16 శాతం పెరిగాయి. విలువలో ఈ పరిమాణం 2.31 బిలియన్‌ డాలర్లు. 2018 ఇదే నెలలో ఈ విలువ కేవలం 1.67 బిలియన్‌ డాలర్లు. 

ఏప్రిల్‌–జనవరి మధ్య వృద్ధి 9.52 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జనవరి మధ్య ఎగుమతుల వృద్ధి 9.52 శాతంగా ఉంది. విలువలో 271.8 బిలియన్‌ డాలర్లు. ఇక ఇదే సమయంలో దిగుమతులు 11.27 శాతం పెరిగి 427.73 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 2017–18 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 136.25 బిలియన్‌ డాలర్ల నుంచి 155.93 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. 

అంతర్జాతీయ పరిస్థితులే కారణం
ఎగుమతుల స్పీడ్‌ లేకపోవడానికి అంతర్జాతీయ కఠిన పరిస్థితులు కారణం. ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగించింది. తయారీ రంగం బలహీనంగా ఉంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రుణ లభ్యత పెరగాలి. ఎగుమతుల వృద్ధికి ఆర్థికపరమైన మద్దతు అవసరం.
– గణేశ్‌ కుమార్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌

డిసెంబర్‌లో సేవల వృద్ధి 7.50 శాతం
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– డిసెంబర్‌లో సేవల రంగం 7.50 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. విలువలో 17.93 బిలియన్‌ డాలర్లు. ఇక సేవల దిగుమతులు ఇదే కాలంలో 12.53 శాతం పెరిగి 11.38 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.   

>
మరిన్ని వార్తలు