సెప్టెంబర్లో ఎగుమతుల పరుగు

15 Oct, 2016 01:12 IST|Sakshi
సెప్టెంబర్లో ఎగుమతుల పరుగు

4.62 శాతం వృద్ధి రెండు నెలల వరుస క్షీణతకు బ్రేక్
2.4 శాతం తగ్గిన దిగుమతులు
9 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు


న్యూఢిల్లీ: ఎగుమతుల పరంగా రెండు నెలల క్షీణతకు సెప్టెంబర్‌లో బ్రేక్ పడింది. ఇంజనీరింగ్, జెమ్స్, జ్యుయలరీ, చేతి ఉత్పత్తులు, వస్త్రోత్పత్తి రంగాలు అందించిన తోడ్పాటుతో సెప్టెంబర్‌లో దేశీయ ఎగుమతులు 4.62 శాతం వృద్ధి చెందాయి. మొత్తం 22.9 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు  జరిగాయి. ఇంజనీరింగ్ 6.51 శాతం, జెమ్స్ అండ్ జ్యుయలరీ 22.42 శాతం, హ్యాండిక్రాఫ్ట్స్ 23 శాతం, టెక్స్‌టైల్స్ 12.62 శాతం, కెమికల్స్ ఎగుమతులు 6 శాతం చొప్పున వృద్ధి చెందడం కలసివచ్చింది.

అదే సమయంలో దిగుమతులు 2.54 శాతం క్షీణించి 31.22 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. దీంతో సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 8.33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గింది.  అయినప్పటికీ ఇది గత తొమ్మిది నెలల కాలంలోనే గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లో వాణిజ్య లోటు గరిష్టంగా 11.66 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

విడిగా రంగాల వారీగా చూస్తే సెప్టెంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 1.43 శాతం క్షీణించగా, ఆయిల్ దిగుమతులు మాత్రం 3.13 శాతం వృద్ధితో 6.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలో ఎగుమతులు మొత్తం మీద చూస్తే 1.74 శాతం క్షీణించాయి. ఈ కాలంలో ఎగుమతుల విలువ 131.4 బిలియన్ డాలర్లుగా ఉంది.  ఇదే కాలంలో దిగుమతులు 13.77 శాతం క్షీణించి 174.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

తొలి ఆరు నెలల కాలంలో వాణిజ్య లోటు 43 బిలియన్ డాలర్లు.
రానున్న నెలల్లో మంచి ఫలితాలు:   ఈ ధోరణి ఇలానే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశీయ ఎగుమతులు 280 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ స్థాయికే చేరతాయని ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారం తాలూకు సానుకూల ఫలితాలు రాబోయే నెలల్లో ఎగుమతుల గణాంకాల్లో మరింతగా ప్రతిఫలిస్తాయని వ్యాఖ్యానించింది.

ఎగుమతుల వృద్ధికి చర్యలు: నిర్మలా సీతారామన్
దేశం నుంచి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సరుకుల రవాణా (లాజిస్టిక్స్) వ్యయం, పన్నుపరంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎగుమతుల పథకాల్లో అవసరమైతే మధ్య కాలిక సవరణలు చేసే లక్ష్యంతో విదేశీ వాణిజ్య విధానంపై తమ శాఖ ఇప్పటికే సమీక్ష ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు.

‘ఎగుమతుల్లో రెండంకెల వృద్ధికి వ్యూహాలు’ అనే అంశంపై శుక్రవారం ఢిల్లీలో అసోచామ్ నిర్వహించిన సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. లాజిస్టిక్స్ వ్యయం అనేది అతి పెద్ద అంశాల్లో ఒకటని, ఇది ధరల పరంగా ఎగుమతిదారుడు పోటీపడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్వల్ప కాలంలో ఈ అంశాల నుంచి బయటపడడం ఎలా అన్న దానిపై ఇప్పటికే కొన్ని సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు.

>
మరిన్ని వార్తలు