ఎగుమతుల ట్రెండ్‌ రివర్స్‌..!

14 Apr, 2017 01:55 IST|Sakshi
ఎగుమతుల ట్రెండ్‌ రివర్స్‌..!

► మార్చిలో 27.6 శాతం అప్‌
►  2016–17లో 4.7% పెరుగుదల
►  రెండేళ్ల క్షీణత నుంచి ‘యూ’ టర్న్‌


శుభ సంకేతం: కేంద్రం
ఎగుమతుల వృద్ధి ఫిబ్రవరి నుంచీ రెండంకెల్లో నమోదుకావడం ఆర్థిక వ్యవస్థకు శుభ సంకేతమని వాణిజ్యమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌ ఎగుమతుల సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల అంశమని వివరించింది.  

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. 2016 మార్చితో పోల్చిచూస్తే, 2017 మార్చిలో ఎగుమతుల విలువ 27.6 శాతం పెరిగింది. ఇది ఐదేళ్ల గరిష్ట స్థాయి. విలువలో ఎగుమతులు 29.23 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. కాగా ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2016–17 ఏప్రిల్‌–మార్చి) ఎగుమతుల్లో కేవలం 4.7 శాతం వృద్ధి నమోదయినా... వరుసగా రెండేళ్ల క్షీణతకు బ్రేక్‌ పడడం హర్షణీయ పరిణామం.

పెట్రోలియం, ఇంజనీరింగ్‌ దన్ను
మార్చిలో మంచి ఫలితానికి పెట్రోలియం, ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల భారీ పెరుగుదల దోహదపడింది.  వీటితోపాటు జౌళి, రసాయనాలు, ఫార్మా, రత్నాలు, ఆభరణాలు, ముడి ఇనుము, మెరైన్‌ ప్రొడక్టుల విభాగాల నుంచి ఎగుమతుల వృద్ధి నమోదయ్యింది.

దిగుమతుల తీరిది...
ఇక దేశంలోకి దిగుమతులు భారీగా 45.25 శాతం పెరిగి 39.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వాణిజ్య లోటు బెంబేలు...
మార్చిలో ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు– ఆందోళనకర రీతిలో నమోదుకావడం మరో ముఖ్యాంశం. ఈ విలువ ఏకంగా 10.43 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో బంగారం భారీ దిగుమతులు ఒకటి.

భారీ పసిడి దిగుమతులు
పసిడి దిగుమతులు మార్చిలో భారీగా జరిగాయి. 2016 మార్చిలో కేవలం 973.45 మిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరిగితే, ఈ ఏడాది మార్చిలో ఏకంగా ఈ విలువ 4.17 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ ధోరణి కొనసాగితే... కరెంట్‌ అకౌంట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అంశం.

వార్షికంగా: మార్చితో ముగిసిన 12 నెలల ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువలో  4.7 శాతం వృద్ధి  నమోదయ్యింది. విలువ రూపంలో 274.64 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. అయితే రెండేళ్లపాటు అసలు వృద్ధిలేకపోగా, క్షీణతో ఉన్న ఎగుమతులు 2016–17లో తిరిగి కోలుకోవడం హర్షణీయమని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దిగుమతుల విలువ 380.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో వాణిజ్య విలువ 105.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 118.7 బిలియన్‌ డాలర్లు.  చమురు దిగుమతుల విలువ 4.24 శాతం వృద్ధితో 86.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయితే, చమురు యేతర దిగుమతుల విలువలో అసలు వృద్ధినమోదుకాలేదు. 1.39 శాతం క్షీణతతో 294 బిలియన్‌ డాలర్లుగా ఈ విలువ ఉంది.

మరిన్ని వార్తలు