బోనస్‌ వచ్చిందా... వాడేస్తున్నారా?

14 May, 2018 01:03 IST|Sakshi

ఉద్యోగులకు ఏటా బోనస్‌ రూపంలో అదనపు ఆదాయం

దాన్ని సాధారణ అవసరాలకు వాడేస్తే నిష్ప్రయోజనం

తెలివిగా వినియోగించాలనుకుంటే ఎన్నో మార్గాలు

అత్యవసర నిధి, రుణాలు తీర్చేయడం, ఫండ్స్‌లో పెట్టుబడులు

ఎఫ్‌డీలు, రిటైర్మెంట్‌ పథకాలను పరిశీలించొచ్చు

వేతన జీవులకు ఏటా బోనస్‌ రూపంలో అదనపు ఆదాయం చేతికందుతూ ఉంటుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్ల కోసమో లేక జాలీ ట్రిప్‌ కోసమో వాడేసుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే, ఈ విధంగా చేతికొచ్చే అదనపు నిధులను అనవసర వినియోగం కంటే అర్థవంతమైన వినియోగానికి మళ్లించగలిగతే ఆ డబ్బు మీ కోసం పనిచేస్తుంది. అదెలా అన్నది నిపుణులు తెలియజేస్తున్నారు.  

అధిక వడ్డీ రుణాలు
ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీ రేట్లకు తిరిగి రెక్కలు వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గృహ రుణాల రేట్లను 20 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. మీరు పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకుని ఉంటే లేదా ఇతర రుణాలు తీసుకుని ఉన్నా బోనస్‌ తరహా అదనపు ఆదాయం చేతికి అందినప్పుడు ముందు ఈ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

అయితే, రుణాలు చెల్లించడం కంటే అధిక రాబడులు వచ్చే చోట బోనస్‌ ఆదాయాన్ని ఇన్వెస్ట్‌ చేయడం సరైనదేనా? అన్న సందేహం రావచ్చు. అయితే, రుణాలను తీర్చివేయడం కూడా ఒక కోణంలో మంచిదే. రుణ భారం తగ్గడం వల్ల ఆ మేరకు ఒత్తిడి తగ్గి స్వేచ్ఛ పెరుగుతుంది. క్రెడిట్‌ స్కోరు కూడా మెరుగవుతుంది.  

టర్మ్‌ప్లాన్‌
చాలా మంది బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటారు. కానీ, ఆచరణలో పెట్టేది కొద్ది మందే. ఒకవేళ తీసుకున్నా ఏటా ప్రీమియం చెల్లిస్తూ దాన్ని కొనసాగించే క్రమశిక్షణ అందరిలోనూ ఉండదు. ఈ తరహా ధోరణితో ఉండేవారికి ఉన్న మార్గం సింగిల్‌ ప్రీమియం పాలసీ.

ఒకేసారి ప్రీమియం చెల్లించడం ద్వారా కోరుకున్న కాల వ్యవధి వరకు బీమా రక్షణ పొందొచ్చు.  సింగిల్‌ ప్రీమియం కాబట్టి ఒకేసారి చెల్లించాల్సిన మొత్తం కొంత ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటే సింగిల్‌ ప్రీమియం కింద సుమారు రూ.1.57 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది.  
ఆరోగ్య రక్షణ
ఈ రోజుల్లో వైద్య బీమా కూడా కనీస అవసరంగా మారిపోయింది. ప్రభుత్వం వైపు నుంచి ఆరోగ్య సంక్షేమానికి ఎటువంటి భరోసా లేని మన దేశంలో సామాన్యులకు వైద్య బీమా తప్పనిసరి. వేతన జీవులు సాధారణంగా కంపెనీ అందించే గ్రూప్‌ హెల్త్‌ పాలసీపైనే ఆధారపడుతుంటారు.

కానీ, ఇది కుటుంబానికి తగినంత కవరేజీతో ఉండకపోవచ్చు. లేదా ఉద్యోగం మానేసినా, కోల్పోయినా ఆ రక్షణ కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. కనుక ఏటా వచ్చే బోనస్‌తో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం సరైనదే. ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీ తీసుకుంటే ఊహించని ఖర్చుల నుంచి బయటపడొచ్చు.

అత్యవసర నిధి
ప్రతీ ఉద్యోగికి అత్యవసర నిధి అన్నది చాలా అవసరం. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోతే కుటుంబ పోషణ యథావిధిగా కొనసాగేందుకు ఇది ఉపయోగపడుతుంది. తిరిగి ఉద్యోగం సంపాదించుకునే వరకు అత్యవసర నిధితో గట్టెక్కవచ్చు.

అందుకే వేతన జీవులు తమ నెలసరి కుటుంబ అవసరాలకు ఎంతవుతుందో లెక్కించి అలా మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చేంత నిధిని రిజర్వ్‌లో ఉంచుకోవాలి. ఇందుకు బోనస్‌ను వినియోగించుకోవచ్చు. కేవలం ఉద్యోగం కోల్పోతే అని కాదు, ఇతరత్రా ఊహించని అత్యవసరాలకు కూడా ఈ నిధి అక్కరకు వస్తుందని గుర్తించాల్సిన అంశం.

ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు
బోనస్‌ ఆదాయాన్ని పెట్టుబడులకు కూడా మళ్లించే ప్రయత్నం చేయవచ్చు. రిస్క్‌ భరించేట్టు అయితే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులను పొందే అవకాశం ఉంది. అయితే బోనస్‌ ఆదాయం మొత్తాన్ని ఒకేసారి కాకుండా లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దాన్నుంచి ప్రతీ నెలా సిప్‌ విధానంలో లేదా సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ ద్వారా మంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లోకి మళ్లించాలి. దీనివల్ల మార్కెట్లలో అస్థిరతల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

పిల్లల విద్య కోసం  
విద్యా వ్యయాలు ఏటా 10 శాతం మేర పెరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఇటీవలే ఐఐఎం అహ్మదాబాద్‌ సంస్థ రెండు సంవత్సరాల మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ ఫీజును రూ.21 లక్షలు చేసింది. 2007 నుంచి చూసుకుంటే పదేళ్ల కాలంలో ఐఐఎం ఫీజులు 500 శాతం పెరిగాయి. మరి మీ పిల్లలు కాలేజీకి వచ్చే సమయానికి ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో ఓ సారి ఆలోచించండి. ఒకవేళ మీ పిల్లలు ప్రస్తుతం స్కూల్‌ విద్యలో ఉండి ఉంటే ఇప్పటి నుంచే వారి ఉన్నత విద్య కోసం బోనస్‌ ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించొచ్చు.  

తల్లిదండ్రుల పేరిట ఎఫ్‌డీలు
బోనస్‌ రూపంలో వచ్చిన ఆదాయాన్ని మీ పేరిట కంటే 60ఏళ్లు దాటిన తల్లిదండ్రుల పేరిట ఇన్వెస్ట్‌ చేయడం మంచి ఆలోచనే అవుతుంది. సీనియర్‌ సిటిజన్లకు బ్యాంకు ఎఫ్‌డీలపై అరశాతం అధికంగా వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నారు. ఇక పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో వార్షికంగా 8.3 శాతం వడ్డీ లభిస్తోంది.

పన్ను పరమైన నిబంధనలు అడ్డు పడుతున్నాయని భావిస్తే తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చి వారితో ఇన్వెస్ట్‌ చేయించొచ్చు. వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వరకూ వడ్డీ ఆదాయంపై పన్ను లేదు. ఇటీవల బడ్జెట్‌లోనే దీన్ని ప్రవేశపెట్టారు.  


రిటైర్మెంట్‌ నిధి
ఏటా వచ్చే బోనస్‌ను కనీసం రిటైర్మెంట్‌ ఫండ్‌కు మళ్లించినా మంచి నిర్ణయమే అవుతుంది. దీని ద్వారా పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద ఏటా రూ.50,000 వరకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపునకు ఇది అదనం. కనుక పన్ను పరిధిలోకి వచ్చే వారు బోనస్‌ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు.

ఒకవైపు పన్ను ఆదా మరో వైపు రిటైర్మెంట్‌ నిధికి మార్గం ఏర్పడుతుంది. అయితే, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులను 60 ఏళ్లు వచ్చిన తర్వాతే వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందులోనూ 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో తప్పనిసరిగా ఇన్వెస్ట్‌ చేయాలి. అంటే 60 శాతం మొత్తాన్ని మాత్రమే మీరు స్వేచ్ఛగా వినియోగించుకోగలరు.

మరిన్ని వార్తలు