తీవ్ర హెచ్చుతగ్గులు!

27 Jul, 2015 00:57 IST|Sakshi
తీవ్ర హెచ్చుతగ్గులు!

ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
 
 న్యూఢిల్లీ : జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ జూలై కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులుంటాయని, ఈక్విటీలు పటిష్టపడేందుకు అవసరమైన మద్దతును ఇచ్చే అంశమేదీ లేదని క్యాపిటల్‌వయా డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని లేదా క్యూ1 కార్పొరేట్ ఫలితాలు ఉత్సాహపరుస్తాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో వున్నాయని, కానీ ఇప్పుడు మార్కెట్లో విశ్వాసం కొరవడిందని జీయోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.

 కొద్దికాలం దిద్దుబాటు...
 సంస్కరణలకు ప్రతీ స్థాయిలోనూ అడ్డంకులు ఏర్పడుతున్నందున, ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లకు సందేహాలు తలెత్తుతున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఈ కారణంగా కొద్దికాలం మార్కెట్ దిద్దుబాటు బాటలో వుండవచ్చని, విస్తృత శ్రేణిలో సూచీలు కదలవచ్చని అంచనావేశారు. వర్షపాతం మెరుగ్గాఉంటుందన్న ఆశాభావం ఇన్వెస్టర్లలో ఉందని, వర్షాలు బావుంటే ఆగస్టు 4నాటి ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో రేట్ల కోత వుండవచ్చని ఆయన చెప్పారు.

 ఈ వారం కార్పొరేట్ ఫలితాలు...
 ఈ వారం ఐటీసీ, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, పీఎన్‌బీ, ఎన్‌టీపీసీ, ఎల్ అండ్ టీ తదితర బ్లూచిప్ కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ గమనాన్ని కొంతవరకూ నిర్దేశింప వచ్చని నిపుణులు చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన  తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంలో కన్పిస్తుందని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ తెలిపారు. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్లు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ నికరలాభం రూ. 6,318 కోట్లకు ఎగిసింది.  

 గతవారం మార్కెట్...
 గతవారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు నష్టపోయి, 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితాల వెల్లడి తర్వాత ఇన్ఫోసిస్ భారీగా పెరగడంతో సెన్సెక్స్ నష్టాలు పరిమితంగా వున్నాయి. బ్యాంకులు, మెటల్, రియల్టీ షేర్లు నష్టపోయాయి.
 
 విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 8,400 కోట్లు

 జూలై నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 8,400 కోట్లు పెట్టుబడి చేశారు. ఈక్విటీల్లో రూ. 7,261 కోట్లు, రుణపత్రాల్లో రూ. 1,154 కోట్ల చొప్పున  వారు నికర పెట్టుబడి చేసినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా