ఎయిర్‌కోస్టా నిధుల సేకరణకు బ్రేక్!

26 Nov, 2015 03:56 IST|Sakshi
ఎయిర్‌కోస్టా నిధుల సేకరణకు బ్రేక్!

మంచి ధర కోసం బ్రాండ్ బిల్డింగ్‌పైనే దృష్టి
  కొత్త ఎయిర్‌లైన్ విధానం
 వచ్చాకే నిధుల సమీకరణ
 ఇండిగో ఐపీవో విజయవంతంతో పెరిగిన నమ్మకం
 దేశవ్యాప్త కార్యకలాపాలపై దృష్టి


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమానయాన సర్వీసుల సంస్థ ఎయిర్‌కోస్టా నిధుల సమీకరణ ప్రక్రియను తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా విడుదల చేసిన పౌర విమానయాన విధాన ముసాయిదా విదేశీ పెట్టుబడులను స్వీకరించడానికి అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా వాటాలను విక్రయించడం ద్వారా వ్యాపార విస్తరణకు నిధులు సేకరించాలని ఎయిర్‌కోస్టా చూస్తోంది. ఇప్పటికే చాలా దేశీ, విదేశీ సంస్థలతో చర్చలు జరిపినప్పటికీ ఆయా సంస్థలు ఆఫర్ చేస్తున్న ధర చాలా తక్కువగా ఉండటంతో ఈ చర్చలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  త్వరలోనే ఎయిర్‌కోస్టా ప్రాంతీయ విమానయాన సంస్థ నుంచి నేషనల్ కారియర్‌గా మారనుండటంతో తమ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని, అప్పుడు అధిక ధర వస్తుందన్నది కంపెనీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో నేషనల్ కారియర్ అనుమతులు లభిస్తే, జనవరి నెలాఖరుకు ఢిల్లీ, భువనేశ్వర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న 67 సీటర్ల ఈ-170 విమానాల స్థానంలో 112 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ-190 విమానాలను తీసుకురానున్నారు.

 దీనివల్ల కంపెనీ నిర్వహణ లాభం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రాండ్ బిల్డింగ్‌పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, వచ్చే ఏప్రిల్, మే తర్వాతనే నిధుల సేకరణ జరపాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉన్న కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్రాండ్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, మార్చిలోగా మొబైల్ యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు