యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ రికార్డ్స్‌

24 Jun, 2020 09:44 IST|Sakshi

కొత్త గరిష్టాన్ని చేరిన నాస్‌డాక్

‌ డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ లాభాల్లో

మే నెలలో గృహ విక్రయాలు అప్‌

ట్రాన్స్‌లేట్‌ బయో 47% జూమ్‌

ప్రధానంగా టెక్‌ దిగ్గజాలు అండగా నిలుస్తుండటంతో నాస్‌డాక్‌ సరికొత్త రికార్డులను సాధిస్తోంది. మంగళవారం ఫాంగ్‌(FAANG) స్టాక్స్‌ బలపడటంతో 75 పాయింట్లు(0.75 శాతం) పుంజుకుని 10,131 వద్ద ముగిసింది.  ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 18 ట్రేడింగ్ సెషన్లలో 16సార్లు లాభాలతో నిలిచింది. ఇంతక్రితం 1999లో మాత్రమే ఈ ఫీట్‌ సాధించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్‌డాక్‌ 21వసారి రికార్డ్‌ గరిష్టాన్ని సాధించడం విశేషం! ఇక డోజోన్స్‌ 130 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 26,156 వద్ద స్థిరపడగా.. ఎస్‌అండ్‌పీ 13 పాయింట్లు(0.45 శాతం) బలపడి 3,131 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ 20 శాతం ర్యాలీ చేసింది. మే నెలలో గృహ విక్రయాలు దాదాపు 17 శాతం ఎగసి 6.76 లక్షలను తాకాయి. విశ్లేషకులు 6.4 లక్షల అమ్మకాలను అంచనా వేశారు. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

రికార్డుల బాట..
ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ 2.15 శాతం లాభంతో 366 డాలర్లను అధిగమించగా.. అమెజాన్‌ 2 శాతం పుంజుకుని 2764 డాలర్లను దాటింది. ఇక మైక్రోసాఫ్ట్‌ కార్ప్‌ 1.35 శాతం వృద్ధితో 202 డాలర్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్‌ తొలుత 474 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ తదుపరి 466 డాలర్లకు నీరసించింది. తద్వారా యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఫేస్‌బుక్‌, అల్ఫాబెట్‌ సైతం 0.7 శాతం చొప్పున బలపడటం గమనార్హం. 

బేయర్ అప్‌
కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్స్‌ తయారీలో సనోఫీ పాస్టెర్‌తో భాగస్వామ్యం కదుర్చుకున్నట్లు వెల్లడించడంతో థెరప్యూటిక్స్‌ కంపెనీ ట్రాన్స్‌లేట్‌ బయో కౌంటర్‌ ఏకంగా 47 శాతం దూసుకెళ్లింది. మోన్‌శాంటో కొనుగోలు తదుపరి వీడ్‌కిల్లర్‌ ప్రొడక్ట్‌పై తలెత్తిన సమస్యకు 8-10 బిలియన్‌ డాలర్లతో సెటిల్‌మెంట్‌ కుదుర్చుకోనున్న వార్తలతో  బేయర్‌ ఏజీ 5 శాతం జంప్‌చేసింది.  కాగా.. ఇతర కౌంటర్లలో బయోన్‌టెక్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, వన్‌లైఫ్‌, క్లియర్‌ వే తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి.

మరిన్ని వార్తలు