నగదు పంపాలా? ఫేస్‌బుక్ చాలు!!

8 Feb, 2015 01:04 IST|Sakshi
నగదు పంపాలా? ఫేస్‌బుక్ చాలు!!

నగదు బదిలీకి అవకాశమిస్తున్న బ్యాంకులు
 ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల ఆరంభం
 ఇతర బ్యాంకుల్లోని ఖాతాలకూ పంపించుకునే వీలు
 ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఉచితంగానే

 
 రాకేష్ తన స్నేహితుడికిడబ్బు పంపాలి. జేబులో, ఖాతాలో రెండింట్లోనూ డబ్బుంది. కానీ, బ్యాంకుకెళ్లి డిపాజిట్ చేయాలంటే చిరాకు. అక్కడి క్యూను తలచుకుంటేనే భయం. ఒక్క  రాకేష్‌దే కాదు. చాలామందిది ఇలాంటి పరిస్థితే. ఇదంతా చూశాకే ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఫ్రీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్‌బుక్ నుంచే నగదును బదిలీ చేయొచ్చు మరి.
 
 పరీక్షల ఫలితాల దగ్గర్నుంచి.. కొత్తగా కొన్ని చేతి గడియారం వరకూ.. ప్రతి దాన్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయందే నిద్రపట్టదు యువతకు. వాటికొచ్చే లైక్‌లు, కామెంట్లు చూసి తీరాల్సిందే. ఇప్పుడీ ఫేస్‌బుక్ బ్యాంకులకూ పాకింది. దీనికోసం ‘కేపే’లో (జ్చుడఞ్చడ) రిజిస్టర్ చేసుకుంటే చాలు. జేబులో రూపాయి లేకున్నా.. పంపాల్సిన వ్యక్తి బ్యాంకు ఖా తా వివరాలు తెలియకున్నా.. ఫేస్‌బుక్ ఉంటే క్షణాల్లో డబ్బు పంపించొచ్చు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ సేవలందిస్తున్నాయి. ఫ్రెంచ్ బ్యాంక్ గ్రూప్ అయిన బీపీసీఈ ట్వీట్టర్ ద్వారా ఈ సేవలను అందిస్తోంది.
 
 కేపేలో రిజిస్ట్రేషన్..
 మన బ్యాంకు ఖాతాను కేపేలో రిజిస్ట్రేషన్ చేసుకోవటమెలాగో ఓసారి చూద్దాం.
 ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యాక.. కేపే అని టైప్ చేస్తే ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. లాగిన్ విత్ ఫేస్‌బుక్ అనే పేజీ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. ఆ తర్వాత మన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోని పేరు, ప్రొఫైల్ పిక్చర్, ఫ్రెండ్స్ లిస్ట్, పుట్టిన తేదీ, నగరం వంటి వివరాలను ఓకే చేయాలి. ఆ తర్వాత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి.
 
 నగదు బదిలీ..
 కేపేలో రిజిస్టరయ్యాక ఎవరికి నగదు పంపాలనుకుంటున్నామో ఎంచుకోవాలి. ఒకరికంటే ఎక్కువ మంది స్నేహితులకు ఒకే సమయంలో డబ్బు పంపాలనుకుంటే అకౌంట్ నంబర్ ముందు మీ ఫ్రెండ్స్ జాబితా ఉంటుంది. అందులో నుంచి ఎంతమందినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
 
 ఆ తర్వాత ఎంత నగదును బదిలీ చేస్తున్నామో నమోదు చేయాలి.కావాలనుకుంటే నగదుతో పాటు ఏదైనా సందేశాన్ని కూడా పంపించవచ్చు.వెంటనే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే చాలు. నగదు బదిలీ అయిపోయినట్టే.
 ఎదుటి వ్యక్తి కేపేలో రిజిస్టర్ కాకపోతే..
 
 డబ్బును పంపే వ్యక్తే కాదు... తీసుకునే వ్యక్తీ కేపేలో రిజిస్టరై ఉంటేనే నగదు నేరుగా అతని బ్యాంకు ఖాతాకు క్రెడిట్ అవుతుంది. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే... ఆ వ్యక్తి ఖాతాకు మీరు నగదు బదిలీ చేసినట్లు అతని మొబైల్ నంబర్‌కు సందేశం వెళ్తుంది. 48 గంటల్లో తను కేపేలో రిజిస్టర్ చేసుకుంటే సరి. లేకపోతే తిరిగి ఆ సొమ్ము ఎవరైతే డబ్బు పంపిస్తారో వారి ఖాతాకే తిరిగొస్తుంది. ఇలా ఫేస్‌బుక్ ద్వారా రోజుకు రూ.2,500... నెల మొత్తం మీద రూ.25 వేల వరకు బదిలీ చేసే అవకాశం ఉంది.
 
 30 బ్యాంకుల్లో ఏ ఖాతాదారుడైనా..
 నగదును పంపిచేవారు, తీసుకునేవారు ఇద్దరూ ఒకే బ్యాంకు ఖాతాదారులు కావాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరికైనా పంపించొచ్చు. ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీస్)లోని 30 బ్యాంకుల ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
 
 ఇవీ ఆ బ్యాంకులు... ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, యూనియన్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా, ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బేసిన్ క్యాథలిక్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, డొంబివిలీ నాగరీ సహకారీ బ్యాంక్ (డీఎన్‌ఎస్), ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్, జే అండ్‌కే బ్యాంకు, జనతా సహకారీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, మెహసనా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఓబీసీ, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆప్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్.
 
 సురక్షితమేనా..
 2009-10లో దేశంలోని బ్యాంకింగ్ రంగంలో రూ.2,038 కోట్ల మోసాలు జరిగితే... 2012-13లో వాటి సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. అంటే అక్షరాలా రూ.8,646 కోట్లు మోసానికి గురైనట్లు అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ అనే సంస్థ తేల్చింది. అయితే ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీలో ఇలాంటి వాటికి ఆస్కారం లేదని సదరు సంస్థ పేర్కొంది. కానీ ఫేస్‌బుక్ ద్వారా నగదును బదిలీ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...
 
 ఈ రకమైన నగదు బదిలీ సేవల్లో రెండు రకాల పిన్ నంబర్లుంటాయి. ఒకటి ఫేస్‌బుక్ యూజర్ నేమ్/ పాస్‌వర్డ్, మరొకటి వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ). నగదు బదిలీ కాగానే డబ్బు పంపినవారికి, తీసుకున్నవారికి ఇద్దరి మొబైళ్లకు మెసేజ్‌లు వస్తాయి.
 
 సొంత సెల్‌ఫోన్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ల నుంచే నగదును బదిలీ చేయాలి. బయటి ఇంటర్నెట్లు, ఇతరుల మొబైల్‌ను వాడొద్దు.ఒకవేళ మీ ఫేస్‌బుక్‌ను ఎవరైనా హ్యాక్ చేసినా.. ఓటీపీ నంబర్ లేనిదే నగదు బదిలీ కాదు కాబట్టి ఒకింత సురక్షితమే.
 

మరిన్ని వార్తలు