క్షమించండి: ఫేస్‌బుక్‌ సీఈవో

2 Oct, 2017 14:43 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పారు. ప్రజలను విడదీసేలా తమ పనితీరు ఉంటే మన్నించాలని వేడుకున్నారు. శనివారం యూదుల పవిత్రదినం ‘యోమ్‌ కిప్పుర్‌’  కావడంతో ఆయన ఈమేరకు క్షమాపణ అడిగారు. పాపాలకు ప్రాయశ్చిత్తంగా ‘యోమ్‌ కిప్పుర్‌’ ను జరుపుకుంటారు.

''గత ఏడాది కాలంగా మా సోషల్‌ మీడియాను తీసుకుంటే, నేనేమన్నా తప్పులు చేసుంటే క్షమించగలరు. ఈ ఏడాదిలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు వేడుకుంటున్నా. మంచిగా పనిచేయడానికి కృషిచేస్తా. అందర్ని కలిపే ఉద్దేశ్యంతో కాకుండా విడదీసేలా మా పని ఉంటే మన్నించగలరు. తర్వాత సంవత్సరమంతా మేమందరూ మంచిగా పనిచేస్తాం'' అని జుకర్‌బర్గ్‌ తెలిపారు. అయితే ఏ విషయంలో ఆయన క్షమాపణ కోరారో స్పష్టం చేయలేదు.

కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై ఇచ్చిన రష్యా ప్రకటనల్లో ఫేస్‌బుక్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్‌ తనకు వ్యతిరేకంగా పనిచేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ.. ‘తనకు వ్యతిరేకంగా పనిచేశామని ట్రంప్‌ అంటున్నారు. లిబరల్స్‌ మాత్రం ట్రంప్‌కు సహకరించామంటున్నారు. ఇరు వర్గాలు మా ఆలోచనలను, కంటెంట్‌ను ఇష్టపడట్లేద’ని అన్నారు. లక్ష డాలర్ల రష్యా రాజకీయ ప్రకటనలపై ఫేస్‌బుక్‌ విచారణను ఎదుర్కొంటోంది.

మరిన్ని వార్తలు