ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఫేస్‌బుక్‌...

27 Jul, 2018 19:05 IST|Sakshi

వాషింగ్టన్‌ : టెక్‌ కంపెనీలంటేనే అధిక జీతాలతో పాటు ఆకర్షణీయమైన సౌకర్యాలకు పెట్టింది పేరు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలు కల్పిస్తాయనే విషయం తెలిసిందే. కానీ త్వరలోనే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు కల్పించే ఉచిత భోజన సౌకర్యాన్ని దూరం చేయనుందని సమాచారం. ఇక మీదట ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు కల్పించే ఇన్‌ హౌస్‌ డైనింగ్‌ (ఆఫీస్‌లోనే ఉచిత భోజనం) సదుపాయాలను నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది.

ఫలితంగా ఉద్యోగులకు ఆఫీస్‌లో టీ, కాఫీ, హ్యాండ్‌ రోల్‌ సుశీ(ఫ్రాంకీస్‌) వంటివేవి లభించబోవని తెలిసింది. అయితే ఈ నిబంధన అందరికీ వర్తించదట. త్వరలోనే సిలికాన్‌ వ్యాలీ, మౌంటెన్‌ వ్యూలో ప్రారంభించబోయే నూతన క్యాంపస్‌కి మారబోయే 2,000 మంది ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన వర్తించనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం మౌంటెన్‌ వ్యూ నిబంధనలు.

మౌంటెన్‌ వ్యూలో ప్రారంభించబోయే ఏ కంపెనీలు కూడా తమ కార్యాలయాల్లో ఉచిత భోజన సౌకర్యాలు కల్పించకూడదు. ఈ నియమం 2014 నుంచి అమల్లో ఉంది. ఇందుకు మౌంటెన్‌ వ్యూ అధికారులు చెప్పే కారణం ఏంటంటే ‘కార్యాలయాల్లోనే భోజన సదుపాయాలు కల్పించడం వల్ల సిలికాన్‌ వ్యాలీ చుట్టు పక్కల ఉన్న స్థానిక వ్యాపారాలు దెబ్బతింటాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం 2014 నుంచి అమల్లో ఉంది. 2014కు ముందు ప్రారంభించిన కంపెనీలకు ఈ నియమం వర్తించదు’ అని తెలిపారు.

నూతన కార్యాలయంలో ఉచిత భోజన సౌకర్యం తొలగింపు గురించి ఫేస్‌బుక్‌ అధికారి ఒకరు ‘త్వరలో మౌంటెన్‌ వ్యూలో ప్రారంభించబోయే నూతన క్యాంపస్‌లో ‘కెఫెటేరియా’ సౌకర్యం లేదు. కార్యాలయాల్లోనే వంటశాల ఉండటం మౌంటెన్‌ వ్యూ నిబంధనలకు విరుద్ధం. కానీ ఉద్యోగులు బయట భోజనం చేసినందుకు అయిన ఖర్చును  కంపెనీనే, ఉద్యోగులకు చెల్లిస్తుంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు