ఫేస్‌బుక్‌కు మరో షాక్‌

6 Sep, 2019 20:41 IST|Sakshi

న్యూయార్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరోసారి విచారణను ఎదుర్కోనుంది. మార్కెట్లో నూతన సంస్థల పోటీని ఎదుర్కోవడానికి వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందన్న అభియోగం నేపథ్యంలోనే విచారణ కొనసాగనుందని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు. ఇదివరకే ఫేస్‌బుక్‌ యుఎస్ ఫెడరల్ కమిషన్ దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద సంస్థ అయినా చట్టాన్ని గౌరవించాల్సిందేనని, అయితే ఈ అంశంపై ఫేస్‌బుక్‌ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ముఖ్యంగా మా విచారణలో వినియోగదారుల సమాచార భద్రత, ప్రకటనల ధరల పెంచడానికి కారణాలను విశ్లేషించనున్నామని జేమ్స్‌ అన్నారు. ఇందులో భాగంగానే కొలరాడో, ఫ్లోరిడా, అయోవా, నెబ్రాస్కా, నార్త్ కరోలినా, ఒహియో రాష్ట్ర అధికారులు దర్యాప్తులో తమ వంతు కీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె తెలిపింది. గతంలో ఫేస్‌బుక్‌ స్పందిస్తూ ఎవరిపైనా గుత్తాధిపత్యం చేయబోమని ఆన్‌లైన్‌లో  తమ స్నేహితులను ఏ విధంగా కలుసుకోవాలనేది వినియోగదారుల స్వేచ్చ మేరకే ఆధారపడి ఉంటుందని ఫేస్‌బుక్‌ స్ప‍ష్టం చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు