కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ

22 Apr, 2020 12:04 IST|Sakshi

డిజిటల్ ఇండియాలో కీలక ముందడుగు  - ముకేశ్ అంబానీ

మహిళలు,యువతకు కొత్త ఉపాధి అవకాశాలు - ముకేశ్ అంబానీ 

దేశవ్యాప్తంగా మూడు కోట్ల కిరాణా దుకాణాలకు ప్రయోజనాలు

సాక్షి, ముంబై: భారతదేశంలో డిజిటల్ అవకాశాలను మెరుగు పర్చేందుకు ఫేస్‌బుక్ రిలయన్స్ జియో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ వెల్లడించారు.  ఈ ఒప్పందంతో భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సొసైటీలలో ఒకటిగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకు దీర్ఘకాలిక, గౌరవనీయ భాగస్వామిగా ఫేస్‌బుక్ను స్వాగతిస్తున్నందుకు ఆనందంగా, ఇంతటి ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి సంతోషంగా వుందని అంబానీ తెలిపారు. అలాగే  డిజిటల్ టెక్నాలజీతో కొత్త ఉపాధి అవకాశాలను  రాబోతున్నాయని అంబానీ ప్రకటించారు. ఫేస్‌బుక్-జియో అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల కిరాణా దుకాణాలకు భారీ ప్రయోజనాలు  కలగనున్నాయని  చెప్పారు. అలాగే రైతులు, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్యార్థులు , ఉపాధ్యాయుల ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, అన్నింటికంటే మించి కొత్త భారతదేశానికి పునాది వేసే మహిళలు, యువకులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.  (ఫేస్‌బుక్‌ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఈజీ ఆఫ్ లివింగ్", "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లక్ష్యాలను సాకారం చేయడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని అంబానీ అన్నారు.  వాట్సాప్  డిజిటల్ చెల్లింపు సేవను ప్రభుత్వం ఆమోదించిన తరువాత  ఫేస్‌బుక్‌ను జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా మార్చే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ కీలకమైన అనుమతితో జియోమార్ట్  ద్వారా చిన్న కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టనున్నాయి. తద్వారా స్థానిక దుకాణాలనుండి రోజువారీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.  పంపిణీ కూడా వేగవంతమవుతుంది. అదే సమయంలో, ఈ దుకాణాలు తమ వ్యాపారాలను పెంచుకోవచ్చు. అసోచామ్-పిడబ్ల్యుసి ఇండియా అధ్యయనం ప్రకారం 2023 లో 135.2 బిలియన్ డాలర్ల విలువతో అవతరించబోతున్న డిజిటల్ మార్కెట్ తో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని  సంస్థ, గూగుల్ పే , పేటిఎమ్ వంటి వాటితో పోటీ పడేందుకు సిద్ధంగా ఉందన్నారు.  భారతదేశంలో వాట్సాప్  400 మిలియన్ల వినియోగదారులతో,  దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చేరువైందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు