డేటింగ్‌ గేమ్‌లోకి ఫేస్‌బుక్‌

2 May, 2018 08:50 IST|Sakshi

శాన్‌జోష్‌ : ఇటీవల కాలంలో డేటింగ్‌ యాప్స్‌ వినియోగించే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతాల్లో ఈ యాప్స్‌కు పాపులారిటీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా డేటింగ్‌ గేమ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పై డేటింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయనున్నట్టు ఈ సోషల్‌ మీడియా దిగ్గజం సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ మంగళవారం ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌పై లక్షల కొద్దీ ప్రజలను కలిపేందుకు డేటింగ్‌ సర్వీసులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నామని, దీంతో యువకుల్లో తమ పాపులారిటీని పుననిర్మాణం చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాక ఎక్కువ సార్లు తమ సైట్‌ను సందర్శిస్తారని కూడా పేర్కొన్నారు. ‘ఫేస్‌బుక్‌పై 200 మిలియన్లకు పైగా యూజర్లు ఒంటరివారే. దీంతో ఇక్కడే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించాం’ అని ఫేస్‌బుక్‌ వార్షిక 8వ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఏర్పాటుచేసిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల సమావేశంలో తెలిపారు. 

ఈ ప్రకటనతో ఫేస్‌బుక్‌ షేర్లు 1.1 శాతం పైకి ఎగిశాయి. ఇటీవల ప్రైవసీ స్కాండల్‌తో తీవ్ర సతమతమైన ఫేస్‌బుక్ షేర్లకు, ఈ వార్త కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఫేస్‌బుక్‌ యూజర్లు తమ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ను బహిర్గతం చేసే ఫీచర్‌ను 2004 ఫిబ్రవరిలో తొలుత తీసుకొచ్చింది. ఈ డేటింగ్‌ సర్వీసులతో ఫేస్‌బుక్‌పై యూజర్లు ఎక్కువ సమయం వెచ్చించడమే కాకుండా... మ్యాచ్‌ గ్రూప్‌ ఇంక్‌ లాంటి పోటీదారులకు అతిపెద్ద సమస్యగా పరిణమిస్తుందని అట్లాంటిక్‌ ఈక్విటీస్‌ విశ్లేషకుడు జేమ్స్‌ కార్డ్‌వెల్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌ చేసిన ఈ ప్రకటనతో మ్యాచ్‌ గ్రూప్‌ షేర్లు 22 శాతానికి పైగా కిందకి పడిపోయాయి. మ్యాచ్‌ గ్రూప్‌ పేరెంట్‌ కంపెనీ ఐఏసీ కూడా 17 శాతానికి పైగా క్షీణించింది. వచ్చే కొన్ని నెలల్లో దీనిపై మరిన్ని వివరాలు బహిర్గతం చేయనున్నట్టు ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ క్రిస్‌ కోక్స్‌ తెలిపారు. 2005 నుంచి ఈ డేటింగ్‌ ఫీచర్‌ గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దీన్ని అమల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు