అతడికి ఫేస్బుక్ భారీ నజరానా

5 May, 2016 10:04 IST|Sakshi
అతడికి ఫేస్బుక్ భారీ నజరానా

న్యూయార్క్ :  సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్  దిగ్గజం ఫేస్బుక్  పదేళ్ల బాలుడికి బగ్ బౌంటీ  నజరానా ప్రకటించింది. ఫేస్ బుక్  సొంతమైన ఫోటో షేరింగ్ వేదిక ఇన్ స్టాగ్రామ్  లోపాన్ని సవరించింనందుకుగాను ఫిన్ లాండ్ కు చెందిన జానీకి 6.65 లక్షలు (10,000 డాలర్లు) చెల్లించింది. వెంచర్  బీట్.కాం ఈ విషయాన్ని రిపోర్టు  చేసింది. సెక్యూరిటీ రీసెర్చర్ కావాలని కలలు కంటున్న జానీ దీనిపై  సంతోషం వ్యక్తం చేశాడు. ఈ  సొమ్ముతో తనకొక కొత్తబైక్, ఫుట్ బాల్  గేర్, తన సోదరుల కోసం రెండు కంప్యూటర్ లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపాడు.

ఫోటో షేరింగ్  ఇన్ స్టాగ్రామ్ లో వున్న సెక్యూరిటీ లోపాన్ని జానీ గుర్తించాడు.   ఈ లోపానికి  స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు.  కంటెంట్ ను, కమెంట్లను తొలగించడానికి అనుమతిస్తున్న  ఒక బగ్ ని  కనుగొన్నాడు.  దానికి సంబంధించిన  కోడ్  రూపొందించాడు. ఈ  కోడ్ మార్చడం ద్వారా ఈ సామాజిక మీడియా వేదికలోని ఎవరి కమెంట్ నైనా తాను డిలిట్ చేయగలనని  చెప్పాడు. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా కంపెనీకి రిపోర్టు చేశాడు. దీంతో అతనికి ఫేస్ బుక్ భారీ బహుమతిని అందజేసింది. అంతేకాదు...ఈ బహుమతిని అందుకున్న అతిచిన్నవాడిగా జానీ అవతరించాడు.

కాగా బగ్‌ బౌంటీ (వితరణ) కార్యక్రమంలో భాగంగా  దాదాపు 800 మంది  పరిశోధకులకు 4.3  మిలియన్ డాలర్లు చెల్లించినట్లు ఇటీవల  ఫేస్‌బుక్‌  ప్రకటించింది.  ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక భద్రతా పరిశోధకులు (205) భారత్‌లోనే ఉన్నారు అని పేర్కొంది.

మరిన్ని వార్తలు