మరో ప్రమాదంలో ఫేస్‌బుక్‌ యూజర్లు

8 Jun, 2018 09:15 IST|Sakshi

వాషింగ్టన్‌ : డేటా స్కాండల్‌ విష​యంలో ఫేస్‌బుక్‌ యూజర్లు ఇప్పటికే తమ అకౌంట్‌ సురక్షితమా? కాదా? అని సతమతమవుతుంటే, తాజాగా మరో ప్రమాదం పొంచుకొచ్చింది. తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను గుర్తించామని, అది యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చేసిందని సోషల్‌ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఈ బగ్‌కు మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. దీంతో మరోసారి ఫేస్‌బుక్‌ ప్రైవసీపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. ఫేస్‌బుక్‌ తన సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన బగ్‌ వల్ల.. కేవలం స్నేహితులకు లేదా మీకు మాత్రమే షేర్‌ చేసుకున్న అంతకముందు పోస్టులు.. పబ్లిక్‌గా వెళ్లిపోయాయి. ఒకవేళ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్‌ మారుతున్నట్టు గుర్తించలేకపోతే, వారు ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ప్రమాద పరిస్థితుల్లో వారి పోస్టులు పబ్లిక్‌గా వెళ్లిపోతాయి. అయితే ఈ బగ్‌ అంతకముందు పోస్టులపై ప్రభావితం చూపలేదని ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఈగన్‌ చెప్పారు. బగ్‌ యాక్టివ్‌లో ఉన్న సమయంలో షేర్‌ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని తెలిపారు. ఒక్కసారి యూజర్లు తమ పోస్టులను సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. 

మరోవైపు ఫేస్‌బుక్‌ మరింత డేటా స్కాండల్‌ వివాదంలో కూరుకుపోతోంది. ఆపిల్‌, శాంసంగ్‌ వంటి 60కి పైగా కంపెనీలతో ఫేస్‌బుక్‌ తన యూజర్ల డేటా షేర్‌ చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ బహిర్గతం చేసింది. కేవలం ఆ కంపెనీలు మాత్రమే కాక, నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు కూడా యూజర్ల డేటాను షేర్‌ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌ విషయంలో ఈ కంపెనీ తీవ్ర ఇరకాటంలో పడగా.. తాజా డేటా షేరింగ్‌ స్కాండల్స్‌ కూడా ఫేస్‌బుక్‌ను దెబ్బకొడుతున్నాయి. తాజాగా కంపెనీ గుర్తించిన బగ్‌ మే 18 నుంచి మే 27 వరకు యాక్టివ్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఆ సమయంలో ప్రభావితమైన పోస్టులను ఒరిజినల్‌ ప్రైవసీ పారామీటర్స్‌కు మళ్లీ మార్చలేమని తెలిపింది. యూజర్లు ‘ఫీచర్‌ ఐటమ్స్‌’ను తమ ప్రొఫైల్స్‌లోకి షేర్‌ చేసేందుకు కొత్త ఫీచర్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తప్పిదం జరిగిందని, దీంతో ఆటోమేటిక్‌గా పోస్టులు, ఫోటో ఆల్బమ్స్‌ పబ్లిక్‌కు వెళ్లిపోయాయని పేర్కొంది.  

మరిన్ని వార్తలు