ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

20 Mar, 2020 05:24 IST|Sakshi

అదనంగా వెయ్యి డాలర్లు: ఫేస్‌బుక్‌

సియాటిల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జకర్‌బర్గ్‌ వెల్లడించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సదుపాయం ఉండదు. (ఫేస్బుక్ కార్యాలయం మూసివేత)

కానీ, వారి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించిన పక్షంలో విధులకు హాజరు కాకపోయినా.. పూర్తి వేతనం లభిస్తుంది. ఫేస్‌బుక్‌ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 2018లో 2,28,651 డాలర్లుగా ఉంది. ‘మీ కుటుంబాల గురించి మరింతగా జాగ్రత్తలు తీసుకునేందుకు మీకు సమయం అవసరమన్న సంగతి సంస్థకు తెలుసు. వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రక్రియకు నివాసంలో ఏర్పాట్లు చేసుకోవడానికి అదనపు ఖర్చులు ఉంటాయి. అందుకే, ఉద్యోగులందరూ అదనంగా 1,000 డాలర్లు పొందవచ్చు‘అని అధికారిక మెమోలో జకర్‌బర్గ్‌ తెలిపారు.  అమెరికాలోని సియాటిల్‌లో ఫేస్‌బుక్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఉంది. ఓ కాంట్రాక్టర్‌కు  కోవిడ్‌–19 బారిన పడటంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా  ఆఫీసులను తర్వాత మూసివేయడంతో చాలా మటుకు ఉద్యోగులు వారం రోజుల నుంచి.. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. (ఊహించని పరిస్థితులు’.. ట్విటర్ కీలక నిర్ణయం!)

మరిన్ని వార్తలు