జీతం రూ. 66, భద్రత వ్యయం రూ. 84 కోట్లు!

30 Apr, 2016 12:37 IST|Sakshi
జీతం రూ. 66, భద్రత వ్యయం రూ. 84 కోట్లు!

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ ఏడాదికి కేవలం ఒక్క డాలర్.. అంటే సుమారు 66 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటారు. కానీ, ఆయన భద్రత కోసం ఫేస్‌బుక్ గత మూడేళ్లుగా వెచ్చించిన మొత్తం ఎంతో తెలుసా.. దాదాపు రూ.84 కోట్లు. ఆదాయంలో దూసుకుపోతూ, సంస్థను అగ్రగామిగా నిలుపుతున్న తమ అధిపతి కోసం ఫేస్ బుక్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో, బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్  (31) రక్షణకు అవుతున్న వ్యయాన్ని  ఫేస్ బుక్  తొలిసారిగా  వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో 24 గంటలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన భద్రత కోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జుకర్‌బర్గ్ సెక్యూరిటీ కోసం సుమారు 84 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు ఫేస్‌బుక్ ఓ నివేదికలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రక్షించినట్లు గానే సీక్రెట్ సర్వీసెస్ సంస్థ జుకర్‌బర్గ్ భద్రతను పర్యవేక్షిస్తోంది.

శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న జుకర్‌బర్గ్‌ భద్రత కోసం అమెజాన్, యాపిల్ లాంటి సంస్థల కంటే పెద్ద మొత్తంలోనే ఫేస్‌బుక్ వెచ్చించింది. గత సంవత్సరం మార్క్ జకర్‌బర్గ్ కోసం  2015 ఆర్థిక సంవత్సరంలో రూ. 30.55 కోట్లను వెచ్చించింది. వాస్తవానికి 2014లో పెట్టిన ఖర్చు కంటే ఇది కొంచెం తక్కువ.  2013లో రూ. 17.60 కోట్లు, 2014లో రూ. 37.19 కోట్లు ఖర్చుపెట్టారు. వీటితో పాటు16 మంది బాడీ గార్డుల జీతాలు, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం రూ. 41  కోట్లను వెచ్చింది. భద్రత ప్యాకేజీలో అంగరక్షకులు, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, అలారం, కెమెరాలతో పాటు, ఆయ కుటుంబం, ఇంటి రక్షణ ఖర్చు తదితర  వివరాలను సంస్థ వెల్లడించింది. ఇస్లామిక్ స్టే్ నుంచి బెదిరింపులు రావడంతో ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు తమ సీఈవో ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

సంస్థకు ఆయన సేవల ప్రాధాన్యం నేపథ్యంలో ఈ నిర్వహణ  ఖర్చు తప్పదని తెలిపింది. జుకర్‌బర్గ్‌ను కాపాడుకోడానికి ఇది చాలా అత్యవసరమని ఫేస్ బుక్ పేర్కొంది. దాదాపు 300 కోట్లకు పైగా సంపద కలిగిన జుకర్‌బర్గ్.. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్-10 కుబేరుల్లో ఆరో స్థానాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు