మొరాయించిన ఫేస్‌బుక్‌.. సమస్యేంటో తెలీదన్న సిబ్బంది

14 Mar, 2019 10:12 IST|Sakshi

ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్ మొరాయించింది. దాంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు బుధవారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ఇబ్బందులు పడ్డారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో కొత్త పోస్టులు పెట్టడం, మెసేజ్‌లు పంపడం సాధ్యపడలేదు. మెసేంజర్ మొబైల్ యాప్ బాగానే పనిచేసింది కానీ... డెస్క్ టాప్‌లో లోడ్ కాలేదు. ఫేస్‌బుక్‌కి చెందిన యాప్‌లలో వాట్సప్ మాత్రమే సజావుగా పని చేసింది. అయితే దీని గురించి ఇంత వరకూ ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

ఈ సమస్య బుధవారం రాత్రి ప్రారంభమయినట్లు సమాచారం. డైరెక్ట్ మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించక యూజర్లు కాసేపు తికమకపడ్డారు. ఇంటర్నల్ ఎర్రర్ కారణంగానే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. డెస్క్‌టాప్‌ వర్షన్‌ లోడ్‌ అవ్వలేదు.. కాగా మొబైల్‌ యాప్‌ మాత్రం కొంత సేపు పని చేసినట్లు యూజర్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ.. ‘ఫేస్‌బుక్‌ను వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగిస్తే బాగుంటుం‍ది. కానీ వ్యాపార అవసరాలకు కూడా ఫేస్‌బుక్‌ మీద ఆధారపడుతున్నాం. మా విషయమే తీసుకొండి.. నేను న్యూయార్క్‌లో ఉన్న మా సిబ్బందితో మాట్లాడటానికి ఉన్న ఏకైక మార్గం.. ఫేస్‌బుక్‌. ఈ మెయిల్‌ పంపించడం ఎప్పుడో మానేశాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్‌ పనిచేయకపోవడంతో యూజర్లు  #FacebookDown, #InstagramDown అనే హ్యాష్‌ ట్యాగ్‌లు క్రియేట్‌ చేసి ట్విటర్‌లో జోకులు పేల్చారు. అయితే ఈ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేస్తామని ఫేస్‌ బుక్ తెలిపింది. దీని గురించి ‘ఫేస్‌బుక్ ఫ్యామిలీ యాప్‌లను యాక్సెస్ చేయడంలో కొంత మంది సమస్య ఎదుర్కొంటున్న విషయం మాకు తెలిసింది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామంటూ ఫేస్‌బుక్ ట్వీట్ చేసింది. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, ఫిలిప్ఫిన్స్, టెక్సాస్, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఫేస్ బుక్ సరిగా పని చేయలేదని సమాచారం.

మరిన్ని వార్తలు