50లక్షలమందికి ఫేస్‌బుక్‌ ట్రైనింగ్‌

24 Nov, 2018 17:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, డిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో  నైపుణ్యాలు మెరుగు  పరుచుకునేలా, బిజినెస్‌ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్‌ షేర్‌ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ పూర్తి చేశామన్నారు.

దక్షిణ, మధ్య ఆసియా, ఇండియా ఫేస్‌బుక్‌ ప్రతినిథి అంఖి దాస్‌ మాట్లాడుతూ.. ‘చిన్న స్థాయి బిజినెస్‌లను అంతర్జాతీయ స్థాయి ఎకానమీ తాకేలా మార్చడానికి ఫేస్‌బుక్‌ కట్టుబడి ఉంది. దీనికై పలు సంస్థలతో కలసి ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 2021 ​కల్లా 5 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.’ అని తెలిపారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలతో దేశీయ చిన్న వ్యాపారాలను  ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ఈ శిక్షణ ఉపయోగపడనుందని తెలిపారు. రాబోయే మూడు సంవత‍్సరాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని  ఆమె చెప్పారు.

50 మంది  భాగస్వాములతో కలిసి సుమారు 150  నగరాలు, 48వేల గ్రామాలలో పది సంస్థల ద్వారా 10లక్షలమం‍దికి శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. ఫేస్‌బుక్‌తో అనుసంధానమై ఉంటే కలిగే లాభాలను ప్రతీ ఒక్కరికీ తెలియజేయాలనుకుంటున్నాము. కొత్తగా సంస్థలు ప్రారంభించే వారికి ఈ ట్రైనింగ్‌ ద్వారా బిజినెస్‌లో ఎదిగేలా చేయాలనేది మా కల అని అన్నారు.  ఈ ట్రైనింగ్‌ని విస్తృతం చేసేందుకు ఫేస్‌బుక్‌ 14 స్థానిక భాషల్లో విధివిధానాలను రూపొందించిందని, ఈ పద్దతిని ఇండియాలోని 29 రాష్ట్రాల్లో ప్రారంభించామని తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్ర లాంటి  రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. 

ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ అవుతున్న విద్వేషపూరిత వీడియోలు, అసాంఘిక పోస్ట్‌లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించారు. ఇప్పటివరకూ 1.5 బిలియన్‌ పోస్ట్‌లను ఫేస్‌బుక్‌ తొలగించిందని, ఇలాంటి వాటిని ఫేస్‌బుక్‌ సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. తమ పాలసీకి భిన్నంగా ఉన్న పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ఫేస్‌బుక్‌లో పొలిటికల్‌ యాడ్స్‌ గురించిన డెవలప్‌మెంట్‌ జరుగుతోందని తెలిపారు. 2019 ఎన్నికల్లోపు ఆ ఫీచర్‌ తీసుకొస్తామని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ ఆలన్‌ అక్టోబర్‌లో చెప్పిన సంగతి తెలిసిందే...

మరిన్ని వార్తలు