రూటు మార్చిన టూరిస్ట్‌...!

13 Oct, 2018 20:55 IST|Sakshi

రూపాయి క్షీణించినా.. తగ్గని విదేశీ టూర్ల జోరు

యూఎస్, యూకే, యూరోప్‌లకు తగ్గిన ప్రాధాన్యం

ఆస్ట్రేలియా,పుకెట్, బాలి, సింగపూర్‌ దేశాలకు ఒకే అంటున్న భారతీయులు 

డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్టస్థాయికి పడిపోయింది... ఇక హాలిడే ట్రిప్‌లు, విదేశీ టూర్లు లేనట్టే... అని అనుకుంటున్నారా? అదేం లేదు రూపాయి దారి రూపాయిదే...ఫారిన్‌ టూర్ల దారి ఫారిన్‌ టూర్లదేనని భారతీయ టూరిస్టులంటున్నారు.రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా  దిగజారినా ఇండియన్ల విదేశీ పర్యటనల జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. అయితే అంతకు ముందు ఏదైనా ఫారిన్‌ ట్రిప్‌ అనగానే యూఎస్, యూకేతో పాటు వివిధ ఐరోపా దేశాల్లో వాలిపోయే వారు కాస్తా ఇప్పుడు పుకెట్, బాలి, సింగపూర్, ఇస్తాంబుల్‌... ఇంకా దక్షిణాఫ్రికా, తదితర దేశాల బాటపడుతున్నారు. 

అసలే ఇప్పుడు హాలిడే సీజన్‌ కావడంతో ఈ పర్యాటక ప్రాంతాలన్నీ భారత్‌తో పాటు ఇతర దేశాల టూరిస్ట్‌లతో కళకళలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ దిగజారినా అదే సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనూ ఆర్థికసంక్షోభం కారణంగా కరెన్సీ విలువ పడిపోయింది. ఈ కారణంగా ఐరోపాతో సహా అమెరికా తదితర పాశ్చాత్య దేశాలకు బదులు టర్కీ, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు భారత టూరిస్ట్‌ల తాకిడి ఒక్కసారిగా పెరిగినట్టు వివిధ ట్రావెల్‌సంస్థలు వెల్లడించాయి. దాదాపు 15 నుంచి 20 శాతం మంది యూఎస్, యూకే, ఐరోపా దేశాల స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఆసియాలోని వివిధ దేశాలను ఎంచుకుంటున్నారు. 

దాదాపు రెండునెలల్లోనే డాలర్‌తో పోల్చితే  రూపాయి విలువ  రూ. 69.04 నుంచి గురువారం ( ఈనెల 12న)రూ.73.89కు  ( 7 శాతానికి పైగా క్షీణత) చేరుకుంది. ఈ ట్రెండ్‌ ఇంకా కొనసాగే సూచనలే కనిపిస్తుండడంతో సింగపూర్,మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, అబుదాబీ, హాంకాంగ్‌– మకావ్, వియత్నాం, కాంబోడియా ఫేవరేట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌లుగా మారిపోయాయని ఈ సంస్థలు తెలిపాయి. వివిధ దేశాల కరెన్సీ విలువలో క్షీణతతో పాటు ఆయా దేశాల విమానచార్జీలు కూడా కొంత మేర తగ్గడం కూడా ఈ పర్యటనలు పెరగడానికి కారణమని అంచనా వేస్తున్నాయి.

పుకెట్‌ ఫ్లయిట్‌ చార్జీలు 23 శాతం, కొలంబో విమానచార్జీ 6 శాతం మేర తగ్గడంతో ఈ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నవారు పదిశాతం వరకు పెరిగినట్టుగా ఇక్సిగో ట్రావెల్‌సంస్థ సీఈఓ ఆలోక్‌ బాజ్‌పేయి చెబుతున్నారు. ‘విదేశీ పర్యటనలపై రూపాయి విలువ దిగజారిన ప్రభావవేమి అంతగా కనిపించడం లేదు. హాలిడే ట్రిప్‌ల కోసం ఒకటి,రెండు నెలల ముందుగానే ప్రణాళికలు వేస్తుంటారు కాబట్టి ప్రస్తుత పండుగ సీజన్‌లో భారతీయుల విదేశీ పర్యటనలు తగ్గినట్టు కనిపించడం లేదు’ అని ఎస్‌ఓటీసీ సంస్థ ప్రతినిధి డానియల్‌ డిసౌజా స్పష్టంచేశారు. 

భారత రూపాయితో పాటు టర్కీ లిర, ఇండోనేషియా రుపాయ, ఇతర దేశాల్లోనూ కరెన్సీ విలువ కూడా దిగజారింది. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, తదితర కారణాలతో శ్రీలంక, టర్కీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, ఇతర దేశాలకు ఇండియన్‌ టూరిస్ట్‌లు క్యూ కడుతున్నారు.ఈ దేశాల్లోని కరెన్సీల కంటే ఇండియన్‌ రూపీ బలంగా ఉండడంతో యూఎస్, ఐరోపా దేశాలతో పోల్చితే ఫారిన్‌టూర్లకు అవుతున్న ఖర్చు కూడా తక్కువగా ఉండడం కూడా ఓ కారణంగా అంచనా వేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు