చౌక విమానయానం మరికొన్నాళ్లు..

12 Nov, 2014 01:32 IST|Sakshi
చౌక విమానయానం మరికొన్నాళ్లు..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  కొంతకాలంగా నష్టాలను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు దిగొస్తున్న ఇంధన ధరలు కలిసొస్తున్నాయి. గత రెండు నెలల్లో ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 11 శాతం మేర తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు చౌక టికెట్ల పోటీని మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.

సాధారణంగా శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసంలో విమానయానానికి డిమాండ్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ సమయంలో టికెట్ల ధరలు పెంచేవాళ్లమని, కానీ ఈసారి ఇంధన ధరలు తగ్గడంతో ధరలను పెంచకుండా ప్రస్తుత తగ్గింపు ధరలనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.  ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు ధరలను మరికొంత కాలం కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా మేనేజింగ్ డెరైక్టర్ ఎల్.వి.ఎస్.రాజశేఖర్ చెప్పారు. ఇంధన ధరలు తగ్గినప్పటికీ ఇంతకంటే విమానయాన ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.

 ప్రపంచంలోని విమాన టికెట్ల సగటు ధరలతో పోలిస్తే ఇక్కడే తక్కువున్నాయని, దీంతో ప్రస్తుత ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదలాయించలేమని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే బాటలో ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా కూడా తక్షణం టికెట్ల ధరలను మరింత తగ్గించలేమని స్పష్టం చేసింది. ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, గో ఎయిర్ వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

 కంపెనీలకు ఊరట...
 విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 నుంచి 50 శాతం వాటా కేవలం ఇంధనానిదే. ఇప్పుడు ఆ ఇంధన ధరలు దిగొస్తుండటంతో విమానయాన సంస్థలకు నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం విమానయాన సంస్థలు ఏటా రూ. 25,000 కోట్లు ఇంధనం కోసం ఖర్చు చేస్తున్నాయి.

ఇప్పుడు ధరలు 11 శాతం తగ్గడంతో పరిశ్రమకు రూ. 2,750 కోట్లు ప్రయోజనం లభించిందంటున్నారు. ఈ ధరల తగ్గింపు వల్ల రూ. 320 కోట్లు తక్షణ ప్రయోజనం కలిగినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. గతేడాది స్పైస్ జెట్ ఆదాయం రూ. 5,200 కోట్లు కాగా, నిర్వహణా వ్యయం రూ. 6,200 కోట్లు అవ్వడంతో రూ.1,000 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు ఇంధన ధరలు తగ్గడంతో నష్టాలు తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఇంధన ధరలు తగ్గడం వల్ల నిర్వహణా వ్యయం 6 శాతం వరకు తగ్గినట్లు రాజశేఖర్ తెలిపారు.

గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ఈ త్రైమాసికం లాభాల్లోకి ప్రవేశించింది. ఒక పక్క ఇంధన ధరలు తగ్గుతున్నా రూపాయి విలువ క్షీణించి డాలరు విలువ పెరుగుతుండటంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విమానాల లీజింగ్ దగ్గర నుంచి చాలా సేవల ఒప్పందాలన్నీ డాలర్లలోనే ఉంటాయని, డాలరు విలువ పెరగడంతో ఇంధన ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

 విస్తరణపై దృష్టి..: గత కొంతకాలంగా విస్తరణకు దూరంగా ఉన్న విమానయాన సంస్థలు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంధన ధరలు దిగిరావడం దేశీయ విమానయాన రంగ వృద్ధికి ఊతమిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త విమానాలను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ. 47,200 కోట్లతో 58 విమానాలను కొనుగోలు చేయనున్నాయి.

 వచ్చే ఫిబ్రవరికి  మరో రెండు కొత్త విమానాలు వస్తాయని, దీంతో మరిన్ని పట్టణాలకు విస్తరించడమే కాకుండా, సర్వీసుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఎయిర్‌కోస్టా తెలిపింది. స్పైస్ జెట్ మరో మూడు విమానాలను కొనుగోలు చేసే పనిలో ఉంది. దేశీయ ప్రయాణికులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో రైలు టికెట్ల కంటే తక్కువ రేటుకే విమానయానాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వంటి పట్టణాలకు పరిమిత సంఖ్యలో రూ.300కే టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు