రైతు రుణాల మాఫీ సరి కాదు

12 Apr, 2017 02:42 IST|Sakshi
రైతు రుణాల మాఫీ సరి కాదు

► నైతికత ప్రమాదంలో పడుతుంది  
► నాబార్డ్‌ చైర్మన్‌ హర్ష కుమార్ భన్వాలా 


ముంబై: రైతుల రుణాల మాఫీ సరికాదని, దీంతో నైతికత ప్రమాదంలో పడుతుందని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)చైర్మన్‌ హర్ష కుమార్ భన్వాలా వ్యాఖ్యానించారు. గంపగుత్తగా రైతులందరికీ రుణ మాఫీ చేయడం కాకుండా.. అవసరమైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు కల్పించవచ్చని ఆయన చెప్పారు. ‘రుణాల చెల్లింపు కోణం నుంచి చూస్తే రుణ మాఫీలనేవి నైతికతకు ప్రమాదకరం. అందరికీ మాఫీ చేసేయడం సరికాదు‘ అనిహర్ష కుమార్ అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.36,000 కోట్ల మేర రైతు రుణ మాఫీ ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కూడా ఇటువంటి ప్యాకేజీలపై విముఖత వ్యక్తం చేయటం తెలిసిందే. తమిళనాడు, హరియాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా రుణాల మాఫీ డిమాండ్‌లు వస్తుండటంతో.. ఈ తరహా పథకాల వల్ల తలెత్తే నైతిక సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భన్వాలా చెప్పారు. అవసరమున్న రైతులకు మాత్రమే ఇలాంటి స్కీములను వర్తింపచేయడం మంచిదన్నారు. పన్నుల చెల్లింపుదారుల సొమ్మును రుణాల మాఫీ పథకాలకు మళ్లించడం సరికాదని భన్వాలా అభిప్రాయపడ్డారు.

రుణ వితరణ లక్ష్యం అధిగమిస్తాం..
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన రూ. 9 లక్షల కోట్ల అగ్రి లోన్స్‌ లక్ష్యాన్ని ఆర్థిక సంస్థలు అధిగమించగలవని భన్వాలా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్ల టార్గెట్‌ను దాటగలవన్నారు. దీర్ఘకాలిక సాగు నిధిపై నాబార్డ్‌ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని.. ఇందులో భాగంగా నిర్ధిష్ట ప్రాజెక్టులకు రూ. 25,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నదని భన్వాలా పేర్కొన్నారు. ఈ ఏడాది సూక్ష్మ–సాగు రంగంపై రూ. 2,000 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు.

తమ మొత్తం లోన్‌ బుక్‌లో దీర్ఘకాలిక రుణాల పరిమాణం రెండేళ్ల క్రితం 19 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 24 శాతానికి ఎగిసిందని భన్వాలా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏడు రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో వెయ్యి మంది పైగా రైతులున్న పది గ్రామాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇక పెద్ద నోట్ల రద్దు తొలినాళ్లలో రీపేమెంట్లు ఒక్కసారిగా పెరిగాయని, ఆ తర్వాత రుణాలకు డిమాండ్‌ తగ్గిందని చెప్పారు. అయినప్పటికీ నిర్దేశిత రూ. 9 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు