డిజిటల్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులు

27 Aug, 2019 13:24 IST|Sakshi

బొగ్గు, కాంట్రాక్ట్‌ తయారీ రంగ నిబంధనల సడలింపు

100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు

మరో విడత సంస్కరణలపై కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ మీడియాతో పాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పూర్తి స్థాయిలో అనుమతించే దిశగా మరో విడత సంస్కరణలపై కసరత్తు చేస్తోంది. వీటిలో భాగంగా బొగ్గు, కాంట్రాక్ట్‌ తయారీ రంగానికి సంబంధించి కూడా ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయనుంది. కేంద్ర క్యాబినెట్‌ త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్‌ తయారీ రంగంలో కూడా 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం తయారీ రంగంలోకి ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. వీటి ప్రకారం తయారీదారు భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోనక్కర్లేకుండా హోల్‌సేల్, రిటైల్‌ (ఈ–కామర్స్‌ సహా) మార్గాల్లో విక్రయించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి కాంట్రాక్ట్‌ తయారీ విభాగం ప్రస్తావన లేకపోవడంతో అస్పష్టత ఉంది. ఏవియేషన్, మీడియా (యానిమేషన్‌ మొదలైన విభాగాలు)బీమాసహా ప్రస్తుతం నిబంధనలను మరింత సరళతరం చేయడంపై దృష్టి సారిస్తోందని సమాచారం.

>
మరిన్ని వార్తలు