పసిడి భవితపై ‘ఫెడ్‌’ రేటు ప్రభావం

18 Mar, 2019 05:01 IST|Sakshi

అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌– నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) 1,200 డాలర్ల  నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్‌ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.   

దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ...
కాగా డాలర్‌ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే.  గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి           10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది.    కాగా ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 24, 22 క్యారెట్ల    ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి.  

మరిన్ని వార్తలు