బిజినెస్ స్కూళ్లలో ఫీజుల మోత

9 Apr, 2016 11:25 IST|Sakshi

ముంబై : మొన్న ఐఐటీ...తాజాగా ఆ జాబితాలో ఐఐఎంలు చేరాయి. టాప్ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలో ఇకనుంచి ఫీజుల మోత మోగనుంది. దాదాపు తొమ్మిది బిజినెస్ స్కూళ్లు ఈ ఏడాది కోర్సు ఫీజులను 7 నుంచి 30 శాతం పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇన్ స్టిట్యూట్ లు బట్టి ఫీజుల పెరుగుదల లో వ్యత్యాసాలు ఉంటాయి.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎమ్) లక్నో 30 శాతం ఫీజును పెంచుతుండగా, ఐఐఎమ్ కోజికోడ్ 23 శాతం పెంచేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీతాలు పెరుగుదల, ఇన్ స్టిట్యూట్ లో మౌలిక సదుపాయాల సమకూర్చడం ఇలా ప్రతీ ఖర్చు పెరుగుతుండటంతో, ఐఐఎమ్ లో ఫీజులు పెంచుతున్నామని రాంచీ క్యాంపస్ డైరెక్టర్ అనింద్య సేస్ తెలిపారు. రాంచీ ఇన్ స్టిట్యూట్ కోర్సు ఫీజును 19 శాతం పెంచడంతో, ఈ ఏడాది విద్యార్థులు రూ.12.5 లక్షల చెల్లించాల్సిఉంది.


భారత్ లో అత్యంత ఖరీదైన మేనేజ్ మెంట్ ప్రొగ్రామ్ అందిస్తున్న ఐఐఎమ్ అహ్మదాబాద్, 5.4 శాతం ఫీజును పెంచి, 19.5 లక్షలుగా నిర్ణయించింది. అదేవిధంగా ఐఐఎమ్ కోల్ కత్తా సైతం 16.5 శాతం పెంచడంతో, ఈ ఏడాది 19 లక్షల ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి ఉంది. ప్రైవేట్ బిజినెస్ స్కూలు సైతం ఫీజులను పెంచాయి. కానీ వీటికి  పరిమితికి మించి ఫీజులు పెంచే వీలులేకపోవడంతో,ఆ స్కూళ్లు ఆదాయాలను ఇతర వనరుల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది. టాప్ బిజినెస్ స్కూలు తీసుకున్న ఈ నిర్ణయంతో, గడిచిన తొమ్మిదేళ్లలో నాలుగు నుంచి ఐదు సార్లు ఫీజులు పెరిగినట్టైంది. తొమ్మిదేళ్ల క్రితం ఐఐఎమ్ అహ్మదాబాద్ ఫీజు 4 లక్షలు కాగా, ఇప్పుడు 19.5 లక్షలకు చేరింది.


బిజినెస్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజులు ద్రవ్యోల్బణం కంటే చాలా వేగంగా పెరుగుతున్నాయని ఈటీఐజీ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. ఈ ఫీజుల మోతతో, విద్యార్థులు మంచి జీతాలు పొందినప్పటికీ, స్టడీ లోన్ లు చెల్లించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డెలాయిట్ డైరెక్టర్ రోహిన్ కపూర్ చెప్పారు. బిజినెస్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులకు ప్లేస్ మెంట్ లో ఉద్యోగం సంపాదిస్తే, తొలి ఏడాదే 13 నుంచి 18 లక్షల జీతం పొందుతారన్నారు.

మరిన్ని వార్తలు