ఫెర్టిలైజర్‌ స్టాక్స్‌కు భారీ డిమాండ్‌

6 Jul, 2020 15:15 IST|Sakshi

ఎరువుల అమ్మకాల దన్ను

భారీ లాభాలతో పలు షేర్లు

ఎన్‌ఎఫ్‌ఎల్‌ 20% అప్పర్‌ సర్క్యూట్‌

చంబల్‌, ఆర్‌సీఎఫ్‌, ఫ్యాక్ట్‌ 5% అప్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డవున్‌ అమలులో ఉన్నప్పటికీ ఎరువుల అమ్మకాలు భారీగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో పీవోఎస్‌ ద్వారా రైతులకు 111.61 లక్షల మెట్రిక్‌ టన్నుల(ఎంటీ) ఎరువులను విక్రయించినట్లు ఎరువులు, రసాయనాల శాఖ పేర్కొంది. ఇదే కాలంలో గతేడాది(2018-19) విక్రయించిన 61.05 లక్షల ఎంటీతో పోలిస్తే ఇవి 83 శాతం అధికమని వెల్లడించింది. తాజా క్వార్టర్‌లో 64.82 లక్షల ఎంటీ యూరియా(67 శాతం అధికం), 22.46 లక్షల ఎంటీ(100 శాతం) డీఏపీ, 24.32 లక్షల ఎంటీ కాంప్లెక్స్‌ ఫెర్టిలైజర్స్‌ (120 శాతం అప్‌) ఎరువులను విక్రయించినట్లు వివరించింది. లాక్‌డవున్‌ నేపథ్యంలోనూ ఎరువుల తయారీ, పంపిణీ సవ్యంగా జరిగినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఫెర్టిలైజర్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. 

ఇదీ తీరు
ఎరువుల అమ్మకాలు ఊపందుకున్న వార్తలతో సుమారు 16 ఎరువుల కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 37 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 154ను తాకింది. తొలుత రూ. 157కు చేరింది. ఇక రాష్ట్రీయ కెమికల్స్‌(ఆర్‌సీఎఫ్‌) 5.3 శాతం పెరిగి రూ. 49 వద్ద కదులుతుంటే.. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌(ఫ్యాక్ట్‌)5.5 శాతం ఎగసి రూ. 50.6ను తాకింది. ఇతర కౌంటర్లలో గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌(జీఎస్‌ఎఫ్‌సీ)3.5 శాతం పెరిగి రూ. 56.5 వద్ద, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ 3.5 శాతం పుంజుకుని రూ. 116.5 వద్ద, జువారీ గ్లోబల్‌ 4 శాతం లాభపడి రూ. 56 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా కెమికల్స్‌ 1 శాతం బలపడి రూ. 311 వద్ద కదులుతోంది. తొలుత రూ. 314 వరకూ ఎగసింది.
 

మరిన్ని వార్తలు